Karthika Masam Special : పుణ్య క్షేత్రాల సందర్శనకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ప్యాకేజీ వివరాలు ఇవీ
24 October 2024, 15:28 IST
- Karthika Masam Special : భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల దర్శనం కోసం ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల 3, 10, 17, 24 తేదీల్లో ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు వివరించారు.
ఏపీఎస్ ఆర్టీసీ
కార్తిక మాసం సందర్భంగా పుణ్య క్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ డీపీటీవో వరప్రసాద్ వివరించారు. ఏలూరులో పుణ్య క్షేత్రాలకు సందర్శనకు ప్రత్యేక బస్సుల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తిక మాసంలో పంచారామ క్షేత్రాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ప్రతి ఆదివారం ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి బస్సులు బయల్దేరుతాయని వివరించారు.
తిరిగి సోమవారం రాత్రి మళ్లీ ఆయా డిపోలకు చేరుకుంటాని వరప్రసాద్ చెప్పారు. వచ్చే నెల 3, 10, 17, 24 తేదీల్లో ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వివరించారు. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్టు వరప్రసాద్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని సూచించారు.
పంచారామాలైన అమరావతి (అమరేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను దర్శించేవారి కోసం సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు నడపనున్నారు.
మూడు ఆర్టీసీ డిపోల నుంచి ప్రయాణ ఛార్జీలు ఒకే విధంగా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌కు రూ.900. సూపర్ లగ్జరీకి రూ.1,200, అల్ట్రా డీలక్స్ రూ.1,100 టికెట్ చార్జీగా నిర్ణయించారు. టికెట్లను ఏపీఎస్ ఆర్టీసీ ఆన్‌లైన్.ఇన్ వెబ్‌సైట్‌లో, లేదంటే డిపో కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా బస్సును బుక్ చేసుకునే భక్తుల కోసం.. వారు ప్రయాణించే చోటుకు బస్సు పంపుతామని అధికారులు వివరించారు.
శబరిమలకు కూడా..
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములు, భక్తుల కోసం కొత్త బస్సులను ఏర్పాటు చేశామని వరప్రసాద్ వివరించారు. డిపో మేనేజర్లను సంప్రదించి శబరిమల స్పెషల్ బస్సులు బుక్ చేసుకోవచ్చని సూచించారు. యాత్రలకు స్పెషల్ ప్యాకేజీలు కల్పించామని చెప్పారు. రోజులను బట్టి ప్యాకేజీలు వర్తిస్తాయని తెలిపారు. వాటి వివరాలు స్థానిక బస్ డిపోల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.
త్రిలింగ దర్శనం..
త్రిలింగ దర్శిని పేరుతో స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చామని వరప్రసాద్ వెల్లడించారు. త్రిలింగ దర్శినిలో శ్రీశైలం, మహానంది, యాగంటిలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ యాత్రలకు కూడా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయం ఉందన్నారు. పూర్తి వివరాలు ఆర్టీసీ డిపోల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)