TTD Deepavali Asthanam 2024 : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్... అక్టోబరు 31న దీపావళి ఆస్థానం, ఆర్జిత సేవ‌లు ర‌ద్దు-deepavali asthanam will be held in tirumala temple on october 31 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Deepavali Asthanam 2024 : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్... అక్టోబరు 31న దీపావళి ఆస్థానం, ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

TTD Deepavali Asthanam 2024 : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్... అక్టోబరు 31న దీపావళి ఆస్థానం, ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 20, 2024 12:58 PM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31వ తేదీన‌ ‘దీపావళి ఆస్థానాన్ని’ నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. దీపావళి ఆస్థానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.

దీపావళి ఆస్థానం 2024
దీపావళి ఆస్థానం 2024

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31వ తేదీన‌ ‘దీపావళి ఆస్థానాన్ని’ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. దీపావళి రోజు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుందని వివరించింది.

ఆస్థానంలో భాగంగా శ్రీ మలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

కాగా సాయంత్రం 5 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు…

దీపావ‌ళి ఆస్థానం కార‌ణంగా అక్టోబరు 31న తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.

నవంబర్ 28 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు :

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జెఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. అధికారులతో కలిసి అమ్మవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధులు, నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలం, ఘంటసాల సర్కిల్ , హైస్కూల్ పరిసరాలు, పసుపు మండపం, పూడిరోడ్డు తదితర ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ…. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేలా టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన పంచమి తీర్థం నాడు విశేషంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, రేణిగుంట, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలన్నారు.

భక్తులు సేదతీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు, గోశాల(పూడి రోడ్డు) వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరిణిలోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు తగిన విధంగా గేట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. తమిళనాడు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తమిళంలో సైన్ బోర్డులు సిద్ధం చేయాలన్నారు.

టిటిడి సివిఎస్వో శ్రీధర్ మాట్లాడుతూ… అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భద్రతాపరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకొని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పంచమి తీర్థం రోజున భక్తులు సేద తీరేందుకు ఏర్పాటు చేసే షెడ్లలో, క్యూలైన్లు, పుష్కరిణి వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా తిరుమల నుంచి పసుపు ఊరేగింపు మార్గాలను ముందే పరిశీలించి ఆ మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Whats_app_banner