TGSRTC : ఆర్టీసీ బస్సుల్లో 'స్పెషల్' బాదుడు.. వివరణ ఇచ్చిన సంస్థ ఎండీ సజ్జనార్-tgsrtc md sajjanar gave an explanation about the special fares in telangana rtc buses ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc : ఆర్టీసీ బస్సుల్లో 'స్పెషల్' బాదుడు.. వివరణ ఇచ్చిన సంస్థ ఎండీ సజ్జనార్

TGSRTC : ఆర్టీసీ బస్సుల్లో 'స్పెషల్' బాదుడు.. వివరణ ఇచ్చిన సంస్థ ఎండీ సజ్జనార్

Basani Shiva Kumar HT Telugu
Oct 14, 2024 04:31 PM IST

TGSRTC : స్పెషల్ ఛార్జీల పేరుతో పండగపూట ఆర్టీసీ టికెట్ల ధరలు పెంచారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ స్పెషల్ ఛార్జీలపై విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో.. సంస్థ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. స్పెషల్ ఛార్జీలపై వివరణ ఇచ్చారు. రెగ్యులర్ సర్వీసుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు.

స్పెషల్ ఛార్జీలపై సజ్జనార్ వివరణ
స్పెషల్ ఛార్జీలపై సజ్జనార్ వివరణ

బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండగల నేప‌థ్యంలో టీజీఎస్ ఆర్టీసీ టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో.. వాస్త‌వం లేదని సంస్థ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. జీవో ప్ర‌కారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే ఛార్జీల‌ను సంస్థ స‌వ‌రించిందని వివరించారు. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదని సజ్జనార్ వివరించారు.

'ప్ర‌ధాన పండగలైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణ‌మి, వినాయ‌క చ‌వితి, ఉగాది, త‌దిత‌ర స‌మయాల్లో.. హైద‌రాబాద్ నుంచి ప్ర‌యాణికులు ఎక్కువ‌గా సొంతూళ్ల‌కు వెళ్తుంటారు. ఈ సంద‌ర్బాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా.. వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతుంది' అని సజ్జనార్ వివరించారు.

'రద్దీ మేరకు హైద‌రాబాద్ సిటీ బ‌స్సుల‌ను కూడా జిల్లాల‌కు తిప్పుతుంది. తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఖాళీగా ఆ బ‌స్సులు వెళ్తుంటాయి. ఆ స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసింది. పండగ‌ల స‌మ‌యాల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే 1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది' అని ఎండీ గుర్తు చేశారు.

'మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు త‌ర్వాత ఆర్టీసీ బ‌స్సుల్లో 25 శాతం మేర ర‌ద్దీ పెరిగింది. గతంతో పోల్చితే సంక్రాంతి, రాఖీ పౌర్ణ‌మి, త‌దిత‌ర పండగ‌ల‌కు బ‌స్సుల్లో ప్ర‌యాణాలు పెరిగాయి. ఆ సమయాల్లో ఒకవైపే రద్దీ ఎక్కువగా ఉంటోంది. తిరుగు ప్రయాణంలో బస్సులన్నీ ఖాళీగా వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆ పండగుల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల‌కు ఛార్జీల‌ను జీవో ప్ర‌కారం స‌వ‌రించ‌డం జరుగుతోంది' అని సజ్జనార్ వివరించారు.

'టీజీఎస్ ఆర్టీసీలో ప్ర‌స్తుతం 9 వేల‌కు పైగా బ‌స్సులు సేవ‌లందిస్తున్నాయి. పండగ స‌మ‌యాల్లో ర‌ద్దీకి అనుగుణంగా ప్ర‌తి రోజు స‌గ‌టున 500 స్పెష‌ల్ బ‌స్సులను సంస్థ న‌డుపుతుంది. ఆ 500 స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే ఛార్జీల సవరణ ఉంటుంది. మిగ‌తా 8500 రెగ్యుల‌ర్ స‌ర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండ‌దు' అని సజ్జనార్ స్పష్టం చేశారు.

'పండగ స‌మ‌యాల్లో రెగ్యుల‌ర్, స్పెష‌ల్ స‌ర్వీసుల్లో టికెట్ ధ‌ర‌ల్లో తేడాలుండటం సాధారణం. ఉదాహ‌ర‌ణ‌కు ఒక ప్ర‌యాణికుడు వెళ్లేట‌ప్పుడు రెగ్యుల‌ర్ స‌ర్వీసుల్లో ప్రయాణిస్తే సాధార‌ణ టికెట్ ధ‌ర‌నే ఉంటుంది. తిరుగు ప్ర‌యాణంలో స్పెష‌ల్ బ‌స్సును వినియోగించుకుంటే జీవో ప్ర‌కారం సవరణ ఛార్జీలుంటాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేస్తుంది. అలాగే, ఆర్టీసీ సిబ్బంది కూడా స్పెషల్ బస్సుల్లో సవరించిన ఛార్జీలను టికెట్ జారీ సమయంలో ప్రయాణికుడికి తెలియజేయడం జరుగుతుంది' అని ఎండీ వివరించారు.

'పండ‌గ స‌మ‌యాల్లో మాత్ర‌మే జీవో ప్ర‌కారం.. స్పెష‌ల్ స‌ర్వీసుల్లో టికెట్ ధ‌ర‌లను సవరించడం జ‌రుగుతుంద‌ని టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం మరోసారి స్ప‌ష్టం చేస్తుంది. సాధార‌ణ రోజుల్లో య‌థావిధిగా సాధారణ టికెట్ ధ‌ర‌లే ఉంటాయి. స్పెష‌ల్ స‌ర్వీసుల‌కు టికెట్ ధ‌ర‌లను సవరించడం సంస్థలో అనవాయితీగా వస్తోంది' అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరణ ఇచ్చారు.

Whats_app_banner