Guntur : గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు స్పాట్ డెడ్
Guntur : గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగ్రాతులను ఆసుపత్రికి తరలించారు.
ఆదివారం రాత్రి గుంటూరు జిల్లా రేపల్లె మండలం పులిగడ్డ పెనుమూడి వారధి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లె మండలంలోని పెదఅరవపల్లి గ్రామానికి చెందిన మాతంగి గంగాధర్ (42)... తన పెదనాన్న వర్ధంతి ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వారు, కొందరు బంధువులు, కుటుంబ సభ్యులు మొత్తం 10 మంది కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు.. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌కు వెళ్లారు. సాయంత్రానికి తిరుగు పయనమయ్యారు.
పులిగడ్డ పెనుమూడి వారధి వద్దకు వచ్చే సరికి.. చీరాల నుండి మచిలీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సును వీరి వాహనం ఢీకొట్టింది. వాహనం నుజ్జునుజ్జు అయింది. బస్సు ముందు భాగంలో డ్రైవర్ వైప్ పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో స్టీరింగ్ మధ్యలో నలిగి గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన దోనేపూడి రాజేష్ (ఊలుపాలెం), తండ్రి కూతుళ్లు గురవయ్య, అమ్ములు (తెనాలి), గంగాధర్ మేనల్లుడు శ్యామ్ (20, పెడన), గంగాధర్ కుమార్తె, అల్లుడు దున్నా శ్రావ్య, కల్యాణ్ బాబును అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ శ్యామ్ మృతి చెందాడు. గంగాధర్ భార్య, కుమారుడు రత్నకుమారి, మనోజ్, గంగాధర్ కుమార్తె సౌజన్య (తెనాలి)ను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రేపల్లె నుంచి క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ మల్లికార్జున రావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అక్కడి వారిని వివరాలు అడిగి సేకరించారు.
గంగాధర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు. ఈ ప్రమాదం ఘటనతో పెదరవపల్లి గ్రామంలో విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు.
ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ బోల్తా..
ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ బోల్తాపడింది. 13 మంది వ్యవసాయ కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరి కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఒంగోలు- నంద్యాల రాష్ట్ర రహదారిపై మర్రిపూడి మండలం అగ్రహారం గ్రామం వద్ద జరిగింది. పొదిలి మండలం కాటూరివారి పాలెం గ్రామానికి చెందిన 25 మంది మహిళా కార్మికులు.. వ్యవసాయ పనుల నిమిత్తం చీమకుర్తి మండలం కంభంపాడు గ్రామానికి వెళ్లారు. తిరిగి సాయంత్రం ట్రాక్టర్ ఎక్కి ఇంటికి బయలు దేరారు.
ట్రాక్టర్ ఇంజిన్, ట్రక్కు సంబంధించిన చింతకాయ విరిగిపోవడంతో ట్రక్కు అదుపు తప్పి బోల్తా కొట్టింది. 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అగ్రహారం గ్రామస్తులు 108 వాహన సిబ్బందికి సమాచారం అందించడంతో.. వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం.. మన్నెం పద్మ, డేరంగుల విజయ, వల్లపు ధనలక్ష్మి, నాగాల కల్యాణి, గొబిశం రజిత, బొల్లినేని సుభాషిణిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
వల్లెపు సుమలత, కుంచాల ఆదిలక్ష్మి స్థానిక ఉడుముల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న సీపీఎం ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అలాగే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)