APSRTC Special : కడప ఆర్టీసీ జోన్ పరిధిలో 758 దసరా ప్రత్యేక బస్సులు - హైదరాబాద్, బెంగళూరుకే అత్యధిక సర్వీసులు
APSRTC Dasara Special Buses : కడప ఆర్టీసీ జోన్ పరిధిలో దసరాకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈసారి 758 ప్రత్యేక బస్సులను నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.హైదరాబాద్, బెంగళూరులకే అత్యధిక బస్సులు నడపనుంది. అక్టోబరు 4 నుంచి 11వ తేదీ వరకు ఈ బస్సులు సర్వీసులు అందిస్తాయి.
రాష్ట్రంలోని ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండగకు ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు కడప ఆర్టీసీ జోన్‌లో 758 స్పెషల్ సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 4 నుంచి 11 వరకు ఈ ప్రత్యేక బస్ సర్వీస్‌లు నడుస్తాయి.
స్కూల్స్, కాలేజీలకు పండగ సెలవులు ఉన్నందున విద్యార్థులు తమ ప్రాంతాలకు వెళ్లేవారు కూడా ఎక్కువ మంది ఉంటారు. కనుక ఈ సమయంలో ప్రయాణికులు రద్దీ భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి రానున్నాయి.
అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 11 వరకు ఎనిమిది రోజుల పాటు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. సాధారణ టిక్కెట్ ఛార్జీలే వసూలు చేస్తారు. ఈ బస్సులు కడప ఆర్టీసీ జోన్ (కడప, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల) ఎనిమిది జిల్లాల పరిధిలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు నిర్వహిస్తాయి. తెలంగాణలోని హైదరాబాద్‌కు 285 బస్సులు, కర్ణాటకలోని బెంగళూరుకు 224 బస్సులు, విజయవాడకు 76 బస్సులు రాకపోకలు నిర్వహిస్తాయి.
తమిళనాడులోని చెన్నైకు 40 బస్సులు, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు తదితర ఇతర ప్రాంతాలకు 133 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 13 తేదీ నుంచి తిరుగు ప్రయాణానికి 596 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో విజయవాడకు 73, హైదరాబాద్‌కు 215, బెంగళూరుకు 253, చెన్నైకి 23, ఇతర ప్రాంతాలకు 32 ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు రిజర్వేషన్‌ను ముందస్తుగా చేసుకోవచ్చని, అందుకు ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇప్పటికే దసరా పండగ సందర్భంగా విజయవాడ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు 13 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీ ఆర్టీసీ ప్రకటించింది.
హైదరాబాద్‌కు 353, బెంగళూరుకి 14, చెన్నైకి 22, విశాఖపట్నానికి 90, రాజమహేంద్రవరానికి 241, రాష్ట్రంలోని ఇతర ప్రాతాలకు 244 బస్సులు మొత్తం 964 బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొస్తుంది. హైదరాబాద్ రూట్‌లోనే ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఆ మార్గంలోనే ఎక్కువ బస్సు సర్వీసులను నడపనున్నారు. తొలి మూడు రోజులు 37 బస్సు సర్వీసులను నడుపుతారు.
ప్రతి శనివారం వాడపల్లికి ప్రత్యేక బస్సు సర్వీస్:
కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి వాడపల్లికి ప్రతి శనివారం బస్సు సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి శనివారం ఉదయం 4 గంటలకు ప్రసిద్ధ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రత్యేక సర్వీసును నడుపుతారు. అలాగే వాడపల్లితోపాటు పెనుకొండ వాసవీ అమ్మవారి దేవాలయం సందర్శంచే విధంగా ఈ సర్వీస్ అందుబాటులోకి తెచ్చారు.
అవనిగడ్డ నుండి మచిలీపట్నం, బంటుమిల్లి మీదుగా వాడపల్లి వెళ్లి తిరిగి మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటలకు అవనిగడ్డ చేసే విధంగా ఈ బస్సు సర్వీస్ నడుపుతారు. మరిన్ని వివరాలకు 9959225466, 7382899427 ఫోన్ నంబర్లను సంప్రదించొచ్చు.