APTDC Papikondalu Tours : పాపికొండల్లో ఏపీ పర్యాటక శాఖ ప్యాకేజీలు…
APTDC Papikondalu Tours పాపికొండల్లో బోటు షికారు చేయాలనుకునే వారికోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల వ్యవధితో రెండు రకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. పర్యాటకులకు అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు.
APTDC Papikondalu Tours పాపికొండల్లో బోటు షికారు చేయాలనుకునే వారికోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల వ్యవధితో రెండు రకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. సెలవు రోజుల్లో కుటుంబంతో కలిసి విహరించేలా ప్లాన్ చేసింది. రాజమహేంద్రవరం, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి మొదలయ్యేలా టూర్లను షెడ్యూల్ చేసింది. ఈ ప్యాకేజీల వివరాలను కాకినాడ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు.
రాజమహేంద్రవరం నుంచి..
ఒక రోజు పర్యటనకు ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7.30 వరకు యాత్ర కొనసాగుతుంది.
ఈ ట్రిప్లో పెద్దలకు రూ.1,250, చిన్నారులకు రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. టిఫిన్, లంచ్(వెజ్), స్నాక్స్ ఇస్తారు.
రెండు రోజుల పర్యటనలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. ఈ ట్రిప్లో పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ వసూలుచేస్తారు.
వివరాలకు 98486 29341, 98488 83091 నెంబర్లలో సంప్రదించాలని డీఎం శ్రీనివాస్ చెప్పారు.
పోచవరం నుంచి..
పాపికొండలకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు ఒకరోజు, రెండు రోజుల పర్యటనలు ఉన్నాయి.
ఒక రోజు పర్యటనకు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తిరిగొస్తారు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీగా నిర్ణయించారు.
రెండు రోజుల పర్యటనలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగొస్తారు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీగా నిర్ణయించారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం, ఇతర వివరాలకు 63037 69675 నెంబర్ లో సంప్రదించాలని డీఎం సూచించారు.
Papikondalu గోదావరి వరదలు తగ్గుముఖం పట్టడంతో పాపికొండలు విహార యాత్ర గత నెలలో ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని కచ్చలూరు వద్ద 2019లో జరిగిన ప్రమాదంతో నిలిచిపోయిన పాపికొండల యాత్రను గత ఏడాది డిసెంబర్లో తిరిగి ప్రారంభించారు. కొద్ది రోజుల పాటు పాపికొండల పర్యాటక యాత్ర సజావుగానే సాగినా వరదల నేపథ్యంలో జూన్ 4న ఆగిపోయింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు గోదావరిలో వరద ప్రవాహం తగ్గలేదు. దీంతో పర్యాటకులు బోట్లను ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తున్నారు.
మరో వైపు పాపికొండలకు వచ్చే పర్యాటకులు లేకపోవడంతో భద్రాచలంలో కూడా వ్యాపారాలు తగ్గిపోయాయి. పాపికొండల యాత్ర పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భద్రాచలం పరిసర ప్రాంతాల్లో మళ్లీ పర్యాటకుల సందడి నెలకొననుంది.
పాపికొండల్లో పర్యటన సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనుకూలంగా ఉంటుంది. గోదావరికి ఇరువైపులా ఉండే ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. పోచవరం నుంచి పాపి కొండలు వెళ్లి, తిరిగి వచ్చేంత వరకు ప్రకృతి అందాలు పర్యాటకుల్ని మైమరిపిస్తాయి. కార్తీక మాసం పర్యాటకుల సీజన్ కావడంతో భద్రాచలానికి యాత్రికులు, భక్తులు తరలి వస్తుంటారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా వర రామచంద్రా పురం మండలంలోని పోచవరం ఫెర్రీ పాయింట్, దేవీపట్నం మండలం పోశమ్మగండి ఫెర్రీ పాయింట్ వద్ద నుంచి పాపికొండల బోటింగ్ ఉంటుంది. సోమవారం ఈ రెండు ప్రాంతాల నుంచి ఏపీ టూరిజం లాంచీలు ప్రారంభం కానున్నాయి. రెండు, మూడు రోజుల్లో మరికొన్ని లాంచీలు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ జిల్లాలతో పాటు, హైదరాబాద్ నుంచి పాపికొండలకు వెళ్లాలనుకునే వారికి పోచవరం ఫెర్రీ పాయింట్ అనువుగా ఉంటుంది.