Special Train : అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమలకు ప్రత్యేక రైలు.. ఛార్జీల వివరాలు ఇవే
Special Train : నవంబర్ నెలలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో.. రద్దీని క్లియర్ చేయడానికి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించింది. భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక రైలు సేవలు అందిచనుంది.
శబరిమల వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక రైలును నడుపుతోంది. మొత్తం 4 రాత్రులు, 5 పగళ్ల ప్యాకేజీతో ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైలు నవంబర్ 16న సికింద్రాబాద్‌లో బయలుదేరి పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, గూడూరు మీదుగా శబరిమల అయ్యప్ప చోట్టనిక్కర దేవి ఆలయానికి చేరుతుంది. 20వ తేదీన తిరుగు ప్రయాణం అవుతుంది.
టీ, టిఫిన్, భోజనం, ఏపీ, నాన్ ఏసీ, ప్రయాణికులకు బీమాతో కలిపి టికెట్ ధర ఒక్కొక్కరికి స్లీపర్ క్లాసులో రూ.11,475, థర్డ్ ఏసీలో రూ.18,790, సెకెండ్ ఏసీలో రూ.24,215 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు 82879 32312, 92814 95848 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని రైల్వే అధికారులు వివరించారు. అయ్యప్ప భక్తులు ఈ సర్వీసును వినియోగించుకోవాలని సూచించారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. గతంలోనూ శబరిమలకు పలు ప్రత్యేక రైళ్లను నడిపారు. ముఖ్యంగా మకర జ్యోతి దర్శనం సమయంలో శబరిమలకు ఎక్కువ మంది వెళ్తుంటారు. వారి కోసం నవంబర్ నెల ఎండింగ్ నుంచి డిసెంబర్, జనవరి నెలలో స్పెషల్ ట్రైన్లను నడిపే అవకాశం ఉంది.
శబరిమల మకరజ్యోతి లేదా మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున...శబరిమల ఆలయంలో నిర్వహించే కార్యక్రమం. మకర సంక్రాంతి నాడు ఈ జ్యోతి దర్శనం ఇస్తుంది కాబట్టి శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. మకరజ్యోతి దర్శనానికి లక్షలాది మంది భక్తులు శబరిమల ఆలయానికి వస్తుంటారు. జ్యోతి దర్శనం కోసం అయ్యప్పస్వామి భక్తులు పోటెత్తుతారు.
శబరిమల మకరజ్యోతి సమయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు తమ దర్శనాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే శబరిమల మకరజ్యోతి ఘట్టం 2-3 నిమిషాల పాటు నిర్వహించే కార్యక్రమం. శబరిమల కొండపై శబరిమల మకరజ్యోతి దర్శనం రోజున యాత్రికుల ఆలయ నిర్వాహకులు మూడుసార్లు మాత్రమే దీపాలు వెలిగిస్తారు. ఆ సమయంలో మాత్రమే జ్యోతి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.