తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc : స‌ప్త శ్రీ‌నివాస, పంచ‌ వైష్ణ‌వ క్షేత్రాల ద‌ర్శ‌నానికి ప్ర‌త్యేక బ‌స్సులు.. ప్యాకేజీ వివరాలు ఇవే!

APSRTC : స‌ప్త శ్రీ‌నివాస, పంచ‌ వైష్ణ‌వ క్షేత్రాల ద‌ర్శ‌నానికి ప్ర‌త్యేక బ‌స్సులు.. ప్యాకేజీ వివరాలు ఇవే!

HT Telugu Desk HT Telugu

19 December 2024, 11:39 IST

google News
    • APSRTC : పుణ్య‌క్షేత్రాల యాత్ర చేసే భక్తుల‌కు ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. స‌ప్త శ్రీ‌నివాస ద‌ర్శ‌న భాగ్యం, పంచ వైష్ణవ క్షేత్ర ద‌ర్శనం, త్రిముఖ వైష్ణ ద‌ర్శ‌న భాగ్యం పేరుతో పుణ్య‌క్షేత్రాలకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను నడిపిస్తోంది. మ‌చిలీప‌ట్నం నుంచి స్పెష‌ల్ స‌ర్వీస్‌లు అందుబాటులో ఉండనున్నాయి.
భక్తుల‌కు ఆర్టీసీ శుభ‌వార్త
భక్తుల‌కు ఆర్టీసీ శుభ‌వార్త

భక్తుల‌కు ఆర్టీసీ శుభ‌వార్త

ఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బ‌ట్టి, ప్ర‌యాణికులు, యాత్రీకులు అత్య‌ధికంగా వెళ్లే మార్గాల‌కు అతిత‌క్కువ ధ‌ర‌కు, సుర‌క్షిత‌మైన ప్ర‌యాణాన్ని అందిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని, ఏడు శ్రీ‌నివాస ఆల‌యాలు, ఐదు వైష్ణ‌వ ఆల‌యాలు, త్రిముఖ వైష్ణ‌వ ఆల‌యాల‌ ద‌ర్శ‌నానికి ప్రత్యేక బస్సు స‌ర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది.

మార్గ‌శిర మాసంలో స‌ప్త శ్రీనివాస ద‌ర్శ‌నం, పంచ వైష్ణ‌వ క్షేత్ర‌ద‌ర్శనం, త్రిముఖ వైష్ణ‌వ ద‌ర్శ‌నం పేరుతో ప్ర‌తి శుక్ర‌, శ‌నివారం ప్ర‌త్యేక స‌ర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ప్ర‌తి శుక్ర‌, శ‌నివారాల్లో రాత్రి సమయంలో బ‌స్సు మ‌చీలిప‌ట్నం ఆర్టీసీ డీపో నుంచి బ‌య‌లుదేరుతోంది. అప్ప‌న‌ప‌ల్లి, యానాం, మండ‌పేట, వాడ‌ప‌ల్లి, అన్న‌వ‌ర‌ప్పాడు, కొడ‌మంచిలి, అబ్బిరాజుపాలెం దర్శ‌నం అనంత‌రం తిరిగి మ‌చిలీప‌ట్నం చేరుకుంటారు.

పంచ‌ వైష్ణ‌వ ఆల‌యాల ద‌ర్శ‌నం..

అంత‌ర్వేది శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి, అప్ప‌న‌ప‌ల్లి శ్రీబాల బాల‌జీ స్వామివారి ఆల‌యం, గొల్ల‌లమామిడాడ కోదండరామ స్వామివారి ఆల‌యం, అన్న‌వ‌రం శ్రీ వీర వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ స్వామివారి దేవ‌స్థానం, ద్వార‌కా తిరుమ‌లలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం అనంత‌రం తిరిగి మ‌చిలీప‌ట్నం చేరుకుంటారు.

త్రిముఖ వైష్ణ‌వ ద‌ర్శ‌నం..

ద్వార‌కా తిరుమ‌లలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం, వాడ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం, అన్న‌వ‌రం స‌త్య‌నారాయ‌ణ స్వామి ద‌ర్శ‌నం అనంత‌రం తిరిగి మ‌చిలీప‌ట్నం చేరుకుంటారు.

ప్యాకేజీ ఇలా..

1. స‌ప్త శ్రీ‌నివాస ద‌ర్శ‌న ప్యాకేజీ సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుకు ఒక్కొక్క‌రికి టికెట్ ధ‌ర రూ.900 లుగా నిర్ణ‌యించారు.

2. పంచ‌ వైష్ణ‌వ ఆల‌యాల ద‌ర్శ‌న ప్యాకేజీ సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుకు ఒక్కొక్క‌రికి టికెట్ ధ‌ర రూ.1,300లుగా నిర్ణ‌యించారు.

3. త్రిముఖ వైష్ణ‌వ ద‌ర్శ‌న ప్యాకేజీ సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుకు ఒక్కొక్క‌రికి టికెట్ ధ‌ర రూ.1,050లుగా నిర్ణ‌యించారు.

టిక్కెట్లు పొందడం ఎలా..

టిక్కెట్లను ఆన్‌లైన్‌లో https://www.apsrtconline.in/oprs-web/services/packagetours.do లింక్ ద్వారా బుక్ చేసుకోవ‌చ్చు. లేక‌పోతే మ‌చిలీప‌ట్నం బ‌స్‌స్టేష‌న్‌లో పొంద‌వ‌చ్చు. ఇత‌ర వివ‌రాల కోసం 7382902034, 7382903240, 7382903142, 9963284363 ఫోన్ నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని మ‌చిలీప‌ట్నం డిపో మేనేజ‌ర్ సూచించారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం