APSRTC : మహా శివరాత్రికి రాజమండ్రి నుంచి కాశీ యాత్ర.. ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీ ఇదే
APSRTC : ఆర్టీసీ నిత్యం కొత్త సర్వీసులను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బట్టి, ప్రయాణికులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతితక్కువ ధరకు, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే ఉత్తప్రదేశ్‌లోని కాశీ, అయోధ్యకి ఈ బస్సు సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.
పుణ్యక్షేత్రాలు కాశీ, అయోధ్య వెళ్లే భక్తులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మహా శివరాత్రికి పుణ్యక్షేత్రం కాశీ, అయోధ్య స్పెషల్ సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రంలోని రాజమండ్రి నుంచి కాశీ, అయోధ్యకి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ సర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ కోరుతోంది. ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటన సర్వీసులానే ఈ బస్సు సర్వీస్‌లు కూడా కాశీ సందర్శించేందుకు తీసుకెళ్తుంది.
రాజమండ్రి నుండి కాశీ వరకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను నిర్వహిస్తుంది. 11 రోజుల పాటు సాగే ఈ యాత్రలో 13 పుణ్యక్షేత్రాల దర్శనంతో టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు శ్రీ కాశీ విశ్వేశ్వరుని దర్శన భాగ్యం కల్పించనుంది. ఈ యత్రకు సంబంధించిన ప్యాకేజీ బస్సుల వివరాలను రాజమండ్రి డిపో మేనేజర్ ఎస్.కె.షబ్నం, అసిస్టెంట్ మేనేజర్ అజయ్ బాబు తెలిపారు.
సందర్శించే పుణ్య క్షేత్రాలు ఇవే..
11 రోజుల పాటు 13 పుణ్య క్షేత్రాల దర్శనంతో ప్యాకేజీని ప్రకటించారు. రాజమండ్రి నుంచి బయలు దేరే బస్సులు భువనేశ్వర్‌లోని లింగరాజస్వామి ఆలయం, పూరిలోని జగన్నాథస్వామి ఆలయం, కోణార్క్‌లో సూర్యనారాయణ స్వామి ఆలయం, జాబ్‌పూర్‌లో గిరిజా దేవి ఆలయం (శక్తిపీఠం), అలహాబాద్‌లో బడే హనుమాన్, శ్రీ కళ్యాణిదేవి ఆలయం, త్రివేణి సంగమం, కాశీలో అన్నపూర్ణ, విశాలాక్షి (శక్తిపీఠం), అయోధ్యలో బాలరాముడి మందిరం,సీతామడిలో సీతాసమాహిత్ స్ధల్ (సీతామర్షి ఆలయం), నైమిశారణ్యంలో గోమతి నదీస్నానం, చక్రతీర్థం, రుద్రావర్తం, లలితాదేవి (ఉపశక్తిపీఠం), గయలో విష్ణుపాద ఆలయం, మంగళగౌరీ ఆలయం (శక్తిపీఠం), బుద్ధగయలో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన మహాబోధి ఆలయం, అరసవిల్లిలో సూర్యనారాయణ స్వామి దేవాలయం, అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయం దర్శనాలు ఉంటాయి.
ప్యాకేజీ..
ఒక్కొక్కరికి పెద్దలకు, పిల్లలకు (ఐదేళ్ల దాటిన వారికి) టిక్కెట్టు ధర రూ.12,800 ఉంటుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు ఎటువంటి టిక్కెట్టు ఉండదు. కాశీ, ఆయోధ్య యాత్రకు సూపర్ లగ్జీర బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. భోజనాలు ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి మళ్లీ టిఫిన్ ఉంటుంది. త్రాగునీరు కూడా ఆర్టీసీనే అందిస్తుంది. భోజనాలు వండి పెడతారు. అందుకోసం వంట మనిషి, ముగ్గురు సహాయకులు ఉంటారు. బస్సు నాలుగు ప్రాంతాల్లో రాత్రి బస చేస్తుంది. కోణార్క్‌లో ఒక రోజు, కాశీలో రెండు రోజులు, నైమిశారణ్యంలో ఒక రోజు నైట్ హాల్ట్ ఉంటుంది.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు..
కాశీ, అయోధ్య యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలకు మొబైల్ నంబర్లు: 9866045588, 9502300189, 9966666544
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)