AP TG Political Recap 2024 : తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ములుపు తిప్పిన 2024- కీలక సంఘటనలివే
14 December 2024, 19:19 IST
AP TG Political Recap 2024 : ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో 2024 సంచలన ఘటనలకు కేంద్రమైంది. వైసీపీ అనూహ్య ఓటమి, కూటమి ఘటన విజయం, బీఆర్ఎస్ కు లోక్ సభలో సున్న, కవిత అరెస్ట్ , షర్మిల రాజకీయ షిఫ్ట్ , పవన్ చేతికి పవర్ 2024 జరిగిన కీలక సంఘటనలు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ములుపు తిప్పిన 2024- కీలక సంఘటనలివే
2024 తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కీలక ములుపు తిప్పింది. ప్రత్యర్థులను చిత్తుచేసి అధికారం సాధించిన నేతలు, హోరాహోరీ పొలిటికల్ వార్ లో అనుకోని సంఘటనలు ఇలా 2024లో జరిగిన టాప్ పొలిటికల్ సెన్సేషన్స్ గురించి ఒకసారి చూద్దాం.
కూటమి హిట్టు
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2024 ఏడాదికే హైలెట్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం అవ్వడం ఎవ్వరూ ఊహించి ఉండరు. సంక్షేమానికి పెద్ద పీట వేసిన వైసీపీ ప్రభుత్వం...ప్రతి ఇంటికీ ఏదో రూపంలో డబ్బులు అందించింది. ఎక్కడో ఉన్న అసంతృప్తి ఓటు రూపంలో వైసీపీకి ఘోరమైన దెబ్బకొట్టింది. టీడీపీ, జనసేన, బీజేపీ జట్టుకట్టి కూటమి ఏర్పాటు చేసి...వైసీపీని ఊహించని దెబ్బకొట్టాయి. 175 సీట్లలో కూటమి పార్టీలు 164 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఇక జనసేన అయితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. చాలా ఏళ్ల తర్వాత టీడీపీకి జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం కూడా 2024లోనే వచ్చింది. ఎన్డీఏలో బీజేపీ తర్వాత 16 ఎంపీలతో రెండో స్థానంలో కీలక భాగస్వామిగా అవతరించింది.
బలపడిన బీజేపీ-బీఆర్ఎస్ లూజర్
2024 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అనూహ్య ఫలితాలు చూసింది. తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 ఎంపీ సీటు కైవసం చేసుకున్నాయి. మూడు ఎంపీ సీట్ల నుంచి 8 ఎంపీ సీట్లకు బీజేపీ ఎగబాకింది. అనూహ్యంగా బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటును కూడా గెలవలేకపోయింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 అసెంబ్లీఎన్నికల్లో ఓటమిపాలైంది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవం చూసింది. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాత స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. అయితే బీఆర్ఎస్ ను తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను కేటీఆర్, హరీశ్ రావు తీసుకున్నారు. అధికార కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
పొలిటికల్ పవర్ స్టార్
పొలిటికల్ పవర్ స్టార్ గా పవన్ కల్యాణ్ ఎదిగిన ఏడాది 2024. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిన పవన్ పార్టీ జనసేన... 2024 సాధారణ ఎన్నికల్లో అటు బీజేపీ, ఇటు టీడీపీకి వారధిగా నిలిచింది. ఏపీలో కూటమి పొత్తుకు పవన్ కల్యాణ్ కీలకంగా మారారు. బీజేపీతో ముందు నుంచీ పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్... కూటమిలోకి టీడీపీని తెచ్చేందుకు పెద్ద పోరాటమే చేశారు. ఓట్లను చీలిపోనివ్వనని చెప్తూ వచ్చిన పవన్... పొత్తు కోసం సీట్లను సైతం త్యాగం చేశారు. 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన జనసేన...అన్ని స్థానాల్లో విజయం సాధించింది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 'ఏయ్ పవన్ నహీ ఆందీ హై' అని స్వయానా ప్రధాని మంత్రి మోదీ పవన్ గురించి ప్రస్తావించారు. పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయిన స్థాయి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం స్థాయికి చేరిన పవన్ కల్యాణ్ కు 2024 బాగా కలిసొచ్చిందే చెప్పాలి.
కవిత అరెస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ దేశ రాజకీయాల్లో పెనుసంచలనం అయ్యింది. దిల్లీ మద్యం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. అనంతరం సీబీఐ సైతం కవితను అరెస్టు చేసింది. సుమారు 165 రోజుల పాటు తీహాడ్ జైలులో ఉన్న కవిత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ పడింది. ఆగస్టులో జైలు నుంచి విడుదలై కవిత కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్నారు. ఏడాది చివర్లో రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.
షర్మిల షిఫ్ట్
వైఎస్ షర్మిల తన రాజకీయాలను తెలంగాణ నుంచి ఏపీకి షిఫ్ట్ చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల...ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. తెలంగాణ నుంచి ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో జట్టుకట్టి పోటీ చేశారు. అయితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. చివరికి ఎంపీగా పోటీ చేసి షర్మిల సైతం ఓడిపోయారు. ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు సాధించకపోయిన... కొన్ని చోట్ల వైసీపీ ఓటమికి కారణం అయ్యింది.
టాపిక్