KTR On Farm House Issue : రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు, ఫ్యామిలీ పార్టీని రేవ్ పార్టీగా ప్రచారం - కేటీఆర్
27 October 2024, 22:19 IST
KTR On Farm House Issue : జన్వాడ ఫామ్ హౌస్ వివాదంపై కేటీఆర్ స్పందించారు. అది ఫామ్ హౌస్ కాదని తన బావమరిది కొత్త ఇల్లు అన్నారు. ఇంట్లోకి వెళ్లారని బంధు మిత్రులకు దావత్ ఇస్తున్నారన్నారు. దీనికి సోషల్ మీడియాలో రేవ్ పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు, ఫ్యామిలీ పార్టీని రేవ్ పార్టీగా ప్రచారం - కేటీఆర్
"మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మా కుటుంబం, బంధువుల మీద అక్రమ కేసులు బనాయించి, కుట్రలు చేసి మా మానసిక స్థైర్యం దెబ్బ తీయాలని రేవంత్ సర్కార్ చూస్తుంది" అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంపై కేటీఆర్... ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. తాము ఉద్యమంలో అడుగుపెట్టిన నాడే చావుకు తెగించి వచ్చినోల్లం ఈ కేసులకు.. చిల్లర ప్రయత్నాలకు బయపడేటోళ్లం కాదన్నారు.
జన్వాడలో తన బావమరిది ఇంట్లో జరిగిన ఫ్యామిలీ పార్టీని రేవ్ పార్టీ అంటూ చిత్రీకరించారని కేటీఆర్ ఆరోపించారు. ఇటీవల తన బావమరది రాజ్ పాకాల జన్వాడలో తాను ఒక ఇల్లు కట్టుకున్నాడని, ఇంట్లోకి వెళ్లినప్పుడు అందర్నీ పిలవలేదని... దీపావళి సందర్భంగా బంధువులను ఇంటికి పిలిచారన్నారు. దానిని రేవ్ పార్టీ అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యామిలీ పార్టీలో 70 ఏళ్ల వయసున్న తన అత్తమ్మతో పాటు చిన్న పిల్లలు ఉన్నారన్నారు. దాన్ని రేవ్ పార్టీ అని ఎలా అంటారని కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగడుతున్నామనే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారి వైఫల్యాలు ఎండగడుతున్నామని కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీల మోసం, మూసీ ప్రక్షాళన స్కామ్, బావమరిదికి అమృత్ టెండర్లు, ఇలా కాంగ్రెస్ స్కామ్ లను బయటపెడుతున్నామన్నారు. అందుకే బీఆర్‌ఎస్ ను ఇబ్బంది పెట్టాలనే రేవ్ పార్టీ అంటూ దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ గత 11 నెలలుగా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కేసీఆర్ నేర్పిన ఉద్యమబాటలో నడుస్తుందన్నారు. రాజకీయంగా బీఆర్ఎస్ తో పోటీపడలేక, మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసుల అడ్డుపెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ఇతర విషయాలపై మంత్రులు సహా కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరూ ముందుకొచ్చి సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు. అందుకే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మా కుటుంబసభ్యులు, బంధువులపై కేసులు బనాయిస్తున్నారన్నారు.
కుటుంబ సభ్యులతో పండుగకు ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలట అని మండిపడ్డారు. తమ బావమరిదికి చెందిన ఇల్లు అని ఫామ్ హౌజ్ కాదన్నారు. ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవారని, ఇల్లు ఖాళీ చేసి ఇటీవలె జన్వాడ రిజర్వ్ కాలనీలో కట్టుకున్న ఇంటిలో గృహప్రవేశం చేశారన్నారు. ఇండ్లలోకి వెళ్లినప్పుడు బంధువులను పిలవలేకపోయానని, దసరా, దీపావళి సందర్భంగా ఇంటికి పిలిచి ఫ్యామిలీ దావత్ ఇచ్చారని కేటీఆర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో రేవ్ పార్టీలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.