తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amma Vodi : 1వ తరగతి ఫ్రీ సీటుకి నోటిఫికేషన్.. అమ్మఒడి నుంచే ఫీజులు

Amma Vodi : 1వ తరగతి ఫ్రీ సీటుకి నోటిఫికేషన్.. అమ్మఒడి నుంచే ఫీజులు

HT Telugu Desk HT Telugu

27 February 2023, 9:38 IST

    • Amma Vodi : ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాల్లలో 25 శాతం కోటా సీట్ల భర్తీ కోసం ఏపీ పాఠశాల విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు... అమ్మఒడి సాయంతోనే ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలకు నోటిఫికేషన్
విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలకు నోటిఫికేషన్ (facebook)

విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలకు నోటిఫికేషన్

Amma Vodi : అందరికీ విద్య అందాలనే సంకల్పంతో.. ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని రూపొందించిన కేంద్రం.. ఇందులో పలు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. ఈ చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటా సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ ఫీజులని ప్రభుత్వమే రీయంబర్స్ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యాక్ట్ ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటాలో సీట్లు పొందే విద్యార్థుల తల్లిదండ్రులు అమ్మఒడి పథకం సాయం నుంచే ఫీజులు చెల్లించుకోవాలని స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ప్రవేశాలకు నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఆదివారం (ఫిబ్రవరి 26న) విడుదల చేసింది. అమ్మఒడి సాయం నుంచే ఫీజులు చెల్లించాలని ఇందులో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

APPSC Marks: ఏపీపీఎస్సీ టౌన్‌ ప్లానింగ్, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్‌ పరీక్షల మార్కుల విడుదల

Dindi Resorts Package : కోనసీమ కేరళ దిండి అందాలు చూసొద్దామా?-ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి.. దివ్యాంగులకి రిజర్వేషన్ల వారీగా ఉచితంగా కేటాయించాలి. విద్యాసంస్థల ఫీజులని ప్రభుత్వం చెల్లించాలి. కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టాన్ని ఇలాగే అమలు చేస్తున్నారు. కానీ.. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వందశాతం అమ్మఒడి పథకం కింద సాయం అందిస్తున్నందున ఇందులోంచే ఫీజులు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం ఏటా రూ. 13 వేలు అందిస్తోంది. ఈ సాయం అందిన తర్వాత 60 రోజుల్లోపు తల్లిదండ్రులు ఫీజు చెల్లించకపోతే తదుపరి సంవత్సరం ఆ మొత్తాన్ని మినహాయించి.. పాఠశాలకు చెల్లిస్తారు. గతేడాది ప్రవేశాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఏడాది ఇచ్చే అమ్మఒడి నుంచే ఫీజు చెల్లించాలి. అమ్మఒడితో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని భావించి.. గతేడాది విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు పొందారు. ఇప్పుడు తాజా ఉత్తర్వులతో తల్లిదండ్రులపైనే ఆ భారం పడింది.

25 శాతం సీట్లకు ప్రవేశాలు ఇలా..

విద్యా హక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటా ప్రవేశాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశాల నోటిఫికేషన్ మార్చి 4న విడుదల కానుంది. మార్చి 6 నుంచి 16 వరకు అన్ని పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 7 వరకు విద్యార్థుల అప్లికేషన్ కు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు గ్రామ, వార్డు సచివాలయాల డేటా ప్రకారం అర్హత నిర్ధారిస్తారు. మే 13న లాటరీ ద్వారా మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. మే 15 నుంచి 21 మధ్య విద్యార్థుల ప్రవేశాలు ధృవీకరిస్తారు. మే 25న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మే 26 నుంచి 30 వరకు ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. పట్టణ పాఠశాల్లలో ఏడాది ఫీజు రూ. 8 వేలుగా... గ్రామీణ ప్రాంతాల్లో రూ. 6,500.. గిరిజన ప్రాంతాల్లో రూ. 5,100 గా ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది.