తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Ys Jagan : వచ్చే ఏప్రిల్‌ నాటికి విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం….సిఎం జగన్

CM YS Jagan : వచ్చే ఏప్రిల్‌ నాటికి విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం….సిఎం జగన్

HT Telugu Desk HT Telugu

26 November 2022, 19:16 IST

    • CM YS Jagan రాజ్యాంగంలోని మహోన్నత ఆశయాలకు ప్రతిరూపమైన  మహనీయుడు , బాబాసాహెబ్‌ అంబేద్కర్‌కు నివాళిగా 2023 ఏప్రిల్‌లో విజయవాడలో  అంబేద్కర్‌  మహా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు  ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చెప్పారు. విజయవాడలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవంలో ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ పాల్గొన్నారు.  
సిఎం జగన్మోహన్ రెడ్డి
సిఎం జగన్మోహన్ రెడ్డి

సిఎం జగన్మోహన్ రెడ్డి

CM YS Jagan భారత రాజ్యాంగం స్ఫూర్తిగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చెప్పారు. భిన్న మతాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు ఉన్న దేశాన్ని ఒక్కతాటిపై నడిపించే శక్తి భారత రాజ్యాంగం ద్వారా లభించిందన్నారు. దేశంలోని 140 కోట్లకు పైగా ప్రజలకు, క్రమశిక్షణ నేర్పే ఒక రూల్‌బుక్‌ భారత రాజ్యాంగమని, మనకు దిశా నిర్దేశం చేసే ఒక గైడ్‌. ఒక ఫిలాసఫర్, ఒక టీచర్‌‌గా నిలుస్తుందని సిఎం చెప్పారు. దేశ సౌర్వభౌమాధికారానికి ప్రతీకగా రాజ్యాంగాన్ని మనకు అందించిన అంబేడ్కర్‌ను స్మరించుకోవడం బాధ్యతన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Update: పగలంతా మండే ఎండలు, ఉక్కపోత… సాయంత్రానికి చల్లబడిన వాతావరణం ద్రోణీ ప్రభావంతో ఏపీలో వర్ష సూచన

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

APPSC Marks: ఏపీపీఎస్సీ టౌన్‌ ప్లానింగ్, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్‌ పరీక్షల మార్కుల విడుదల

రాజ్యాంగ లక్ష్యమైన గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేస్తూ దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్ధను అమలు చేస్తున్న ప్రభుత్వం బహుశా తమదేనన్నారు. ప్రభుత్వ బడులలో పేదలకు ఇంగ్లిషు మీడియంలో చదువుకునే అవకాశం లేకుండా చేయడం ద్వారా అమలవుతున్న నయా అంటరానితనం మీద సీబీఎస్‌ఈ ఇంగ్లిషు మీడియంతో పోరాడుతున్నామన్నారు.

జగనన్న అమ్మఒడి, వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ సున్నావడ్డీ, 30 లక్షల ఇళ్ల పట్టాలు, మహిళల పేరుమీదే రిజిస్ట్రేషన్, ఇప్పటికే మంజూరు చేసిన 21 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్‌ వంటి అనేక ముందడుగులు వేసిన మహిళ ప్రభుత్వం కూడా తమదన్నారు.

రాజధానికి సేకరించిన భూముల్ని పేదల ఇళ్ల స్ధలాలకు కేటాయిస్తే అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదించిన దుర్మార్గం భారతదేశంలో మొలకెత్తుతుందని బహుశా రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఊహించి ఉండకపోవచ్చన్నారు.

వాహనమిత్ర, రైతు భరోసా, పెన్షన్‌ కానుక, ఆసరా, సున్నావడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మఒడి, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యఆసరా, విద్యా దీవెన, తోడు, చేదోడు, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, విద్యాకాను‌క, గోరుముద్ద, 30 లక్షల ఇళ్లపట్టాలు, చేయూత, బడులలోనూ, ఆస్పత్రుల్లోనూ నాడు–నేడు ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా పేదరికం నుంచి సామాజిక, ఆర్ధిక తారతమ్యాల నుంచి బయటపడేందుకు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేయాలన్న సంకల్పం నుంచి పుట్టాయన్నారు.

రాష్ట్రంలో 35 నెలల పాలనలో డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా నేరుగా బటన్‌ నొక్కి ప్రజలకు వాళ్ల బ్యాంక్‌ అకౌంట్లలోకి వెళ్లే గొప్ప వ్యవస్ధను తీసుకువచ్చామని, లంచాలకు తావులేకుండా, విచక్షణకు తావులేకుండా నేరుగా ప్రజలకు అందించిన మొత్తం ఇప్పటివరకు రూ.1,76,517 కోట్లు ఉందన్నారు. గత 35 నెలల్లో డీబీటీ, నాన్‌ డీబీటీల ద్వారా రూ.3,18,037 కోట్ల రూపాయలు ప్రజలకు అందించామన్నారు. ఇందులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీ వర్గాలకు అందినది 79 శాతంగా ఉందన్నారు.

రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ఎంతగా కట్టుబడి ఉన్నామో ఈ అంకెలే సాక్ష్యమని చెప్పారు. మంత్రివర్గ సహచరులలో మొత్తం మంత్రిమండలిలో దాదాపు 70శాతం ఈ సామాజిక వర్గాలే ఉన్నాయన్నారు. రెండు మంత్రివర్గాలలోనూ 5 గురికి డిప్యూటీ సీఎం పదవులిస్తే అందులో 4 గురు అంటే 80శాతం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించామన్నారు.

శాసనసభ స్పీకర్‌గా బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని, శాసనమండలి చైర్మన్‌గా ఒక ఎస్సీని నియమించడమే కాకుండా, శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన నా అక్కను ఆ స్ధానంలో కూర్చొబెట్టాం. సామాజిక న్యాయ చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యయమన్నారు.

మూడు సంవత్సరాలలో రాజ్యసభకు 8మందిని పంపితే అందులో 4గురు బీసీలే. ఉన్నారన్నారు. శాసనమండలికి అధికార పార్టీ నుంచి 32 మందిని పంపిస్తే అందులో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారున్నారు. 13 జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులలో 9 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయించామని చెప్పారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో 86 శాతం, మున్సిపాల్టీలలో 69 శాతం, మండల ప్రజాపరిషత్‌ ఛైర్మన్‌లలో 67 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకే కేటాయించామని చెప్పారు.

వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్‌ పదవులలో 58 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. శాశ్వత ప్రాతిపదికిన బీసీ కమిషన్‌ను కూడా నియమించిన ప్రభుత్వం తమదేనన్నారు.

టాపిక్