తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Telugu News Updates 8th October : యాదాద్రిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఏపీ తెలంగాణ తాజా వార్తలు
ఏపీ తెలంగాణ తాజా వార్తలు

Telugu News Updates 8th October : యాదాద్రిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08 October 2022, 22:20 IST

  • Today Telugu News Updates: అక్టోబర్ 08 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. లైవ్ అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి

08 October 2022, 22:20 IST

జంబ్లింగ్ విధానం….

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో జంబ్లింగ్‌ విధానాన్ని అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్ణయించింది. దీన్ని అనుసరించి.. పక్కపక్కన కూర్చునే అభ్యర్థులకు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను ఇవ్వనున్నారు. ప్రశ్నపత్రాల సెట్ల రూపకల్పనలో కూడా ఈసారి కొత్త విధానాన్ని అమలుచేయాలని కమిషన్‌ నిర్ణయించింది. 

08 October 2022, 22:01 IST

కాకినాడలో ఘోరం

ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంతో యువతి గొంతుకోశాడు. కొన ఊపిరితో ఉన్న బాధితురాలను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కొద్ది సమయంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘోర ఘటన ఏపీలోని కాకినాడ గ్రామీణం జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

08 October 2022, 20:48 IST

భక్తుల రద్దీ….

యాదాద్రిలో భక్తుల రద్ధీ కొనసాగుతోంది. పెరిగిన రద్దీతో స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కౌంటర్‌ వద్ద, క్యూలైన్ల వద్ద కిక్కిరిసిన భక్తులతో తోపులాట, స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి.

08 October 2022, 20:32 IST

నగరంలో భారీ వర్షం…. 

హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వీడడంలేదు. శనివారం సాయంత్రం సిటీని భారీ వర్షం ముంచెత్తింది. పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, షేక్ పేట, నాంపల్లి, గోల్కొండ, ఎస్సార్ నగర్, హైటెక్ సిటీ, మూసాపేట, మాదాపూర్, యూసుఫ్ గూడ, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

08 October 2022, 20:03 IST

కేటీఆర్ ట్వీట్…. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పార్టీ నేతలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. బండి సంజయ్‌ను ఇలాగే వదిలేయకండి బీజేపీ బాబులూ అంటూ ట్వీట్ చేశారు.

08 October 2022, 19:18 IST

గంటా భేటీ…

మెగాస్టార్ చిరంజీవితో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత చిరు ఇంటికి వెళ్లిన గంటా.. పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి భేటీ మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

08 October 2022, 18:23 IST

మధ్యప్రదేశ్ ట్రిప్…. 

hyderabad - mp tour: ఐఆర్‌సీటీసీ ' మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్' ట్రిప్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ టూర్ అక్టోబర్ 19వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

08 October 2022, 17:38 IST

ఐఏఎస్‌లు బదిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. సివిల్‌ సప్లయిస్‌ డైరెక్టర్‌గా విజయ సునీత, గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్‌గా భావన, శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌గా మల్లారపు నవీన్‌, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా సి. విష్ణు చరణ్‌, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌గా నిధిమీనా, ఏపీసీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌గా కట్టా సింహాచలం బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

08 October 2022, 16:52 IST

స్పెషల్ ట్రైన్స్… 

నాందేడ్ - నర్సాపూర్, తిరుపతి - శ్రీకాకుళం, శ్రీకాకళం - తిరుపతి, తిరుణవెల్లి - దానాపూర్, దనపూర్ - తంబారం ప్రాంతాల మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

08 October 2022, 16:34 IST

అభ్యర్థి ఖరారు… 

బీఎస్పీ పార్టీ మునుగోడు ఉపఎన్నికల అభ్యర్ధిగా ఆందోజు శంకరా చారిని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాంపల్లిలో తమ పార్టీ అభ్యర్దిని ప్రకటించారు. బీసీ అభ్యర్థి అయిన ఆందోజు శంకరాచారిని బరిలోకి దింపుతున్నట్లు తెలిపారు. 

08 October 2022, 16:11 IST

ఏపీలోకి జోడో యాత్ర… 

Rahul gandhi Jodo yatra in AP: కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రసుత్తం కర్ణాటకలో కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగే యాత్ర ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ దాదాపు ఖరారైంది. అక్టోబర్ 14 వ తేదీన ఏపీలోకి జోడో యాత్ర ఎంట్రీ కానుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో అగ్రనేతకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

08 October 2022, 15:49 IST

ఫస్ట్ లుక్ విడుదల…. 

గుజరాత్ లోని మోధేరా సూర్య దేవాలయం ధగధగ మెరిసిపోతుంది. ఇందుకు సంబంధించిన లైట్ అండ్ సౌండ్ షో ఫస్ట్ లుక్ విడుదలైంది. సూర్య దేవాలయంలో సౌరశక్తితో ఏర్పాటు చేసిన హెరిటేజ్ లైటింగ్, 3డి ప్రొజెక్షన్ మోధేరా చరిత్రపై సందర్శకులకు అవగాహన కల్పిస్తుంది. అక్టోబర్ 9న ప్రధాని మోదీ ఈ ఆలయాన్ని సందర్శించి 3డి ప్రొజెక్షన్ ను ప్రారంభించనున్నారు.

08 October 2022, 15:32 IST

కస్టడీ నుంచి పరార్…. 

ఢిల్లీలో పోలీసులకు షాక్ ఇచ్చాడు కస్టడీలోని ఓ నిందితుడు. అనూహ్యంగా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన అక్టోబర్ 6వ తేదీన వెలుగు చూసింది. వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా నేరస్థుడు ఒక్కసారిగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. నిందితుడు పరిగెత్తుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు కాగా... విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు

08 October 2022, 14:22 IST

ఇంద్రకీలాద్రి మూసివేత….

ఈ నెల 25న ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేయనున్నారు.  మరుసటి రోజు 26వ తేదీన అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి లభించనుంది.

08 October 2022, 14:23 IST

హాల్ టికెట్స్ లింక్…

TSPSC Group1 Preliminary Test 2022: తెలంగాణ గ్రూప్-1 ప‌రీక్షకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరు 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు రేపట్నుంచి హాట్ టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది.

9 నుంచి హాల్ టికెట్లు...

TSPSC Group - 1 Hall Ticekts 2022: గ్రూప్ 1 కు సంబంధించిన హాట్ టికెట్లు అక్టోబర్ 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు పొందవచ్చని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహణ కోసం 1040 సెంటర్లను ఏర్పాటు చేశారు.

ఇలా డౌన్లోడ్ చేసుకోండి...

అభ్యర్థులు తొలుత https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

Group 1Preliminary Test Hall Tickets 2022 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

సంబంధిత వివరాలను ఎంట్రీ చేసి క్లిక్ చేయండి.

మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ పొందవచ్చు.

08 October 2022, 12:59 IST

కేసీఆర్‌పై సోము వీర్రాజు విమర్శలు

జాతీయ పార్టీ పెట్టే హక్కు కేసీఆర్‌కు లేదని,  ఆంధ్రులను పాలెగాళ్లు, ద్రోహులుగా కేసీఆర్ వర్ణించారని  అలాంటి నేత జాతీయ పార్టీ ఎలా పెడతారని ప్రశ్నించారు.  కేసీఆర్ కు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదని, కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్నారని ఎద్దేవా చేశారు.  తెలంగాణలోనూ టీఆర్ఎస్ కు ఓటమి ఖాయం  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. 

08 October 2022, 12:25 IST

బీజేపీ అభ్యర్దిగా కోమటిరెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఆగష్టు 8న  తన పదవికి కోమటిరెడ్డి రాజీనామా చేశారు. ఆగష్టు 21న  బీజేపీలో చేరారు. దాదాపు రెండు నెలలుగా మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో ఉత్కంఠ  రేపుతోంది.  బీజేపీ నేతలు తరుణ్ చుగ్‌, సునీల్ బన్సాల్ సమక్షంలో సోమవారం  కోమటిరెడ్డి నామినేషన్ వేయనున్నారు. కేంద్ర  మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. 

08 October 2022, 11:50 IST

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కరణం ధర్మశ్రీ

విశాఖ పట్టణాన్ని రాజధానిగా చేయాలంటూ ఎమ్మెల్యే పదవికి కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు.  స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి దానిని జేఏసీ ప్రతినిధులకు అందచేశారు.  రాజీనామా లేఖను వికేంద్రీకరణ సాధనకోసం ఏర్పడిన జేఏసీ ప్రతినిధులకు అందజేశారు. విశాఖను రాజధానిగా అడ్డుకోవడాన్ని ధర్మశ్రీ తప్పు పట్టారు.  దమ్ముంటే అచ్చన్నాయుడు రాజీనామా చేయాలని సవాలు చేశారు. అచ్చన్నాయుడుపై తాను పోటీకి సిద్ధమని ప్రకటించారు.  

08 October 2022, 11:26 IST

హైదరాబాద్‌ చేరుకున్న మల్లిఖార్జున ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఉన్న మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఖర్గేకు ఘన స్వాగతం పలికారు. ఏఐసిసి అధ్యక్ష బరిలో ఉన్న ఖర్గే కాంగ్రెస్ పార్టీ నాయకులతో భేటీ కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గేతో పాటు శశిథరూర్‌ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు ఖర్గేకు హైదరాబాద్‌లో స్వాగతం పలికారు. 

08 October 2022, 11:22 IST

తిరుమలలో రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. తమిళనాట పెరటాసి మాసం మూడో శనివారం నేపథ్యంలో తమిళనాడు నుంచి భక్తులు వేలాదిగా తిరుమలకు తరలి వచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.

08 October 2022, 10:48 IST

మహారాష్ట్ర ప్రమాదంపై ప్రధాని విచారం

మహారాష్ట్రలోని  నాసిక్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు.  మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్ధికసాయం ప్రకటించారు. 

08 October 2022, 10:47 IST

నాసిక్ లో ఘోర ప్రమాదం

మహారాష్ట్రలోని నాసిక్ లో ఘోర ప్రమాదం  జరిగింది. ట్రక్కును ఢీకొనడంతో మంటలు చెలరేగి  బస్సు  దగ్దమైంది.  ప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు. మరో  21 మందికి గాయాలు అయ్యాయి. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు మహారాష్ట్ర సిఎం.

08 October 2022, 9:55 IST

కృష్ణా నదిలో వరద ప్రవాహం

శ్రీశైలం, నాగార్జునసాగర్ కు పెరిగిన ప్రవాహం పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.   శ్రీశైలం 5 గేట్లు ఎత్తి 1.39 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.   నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. మరోవైపు పులిచింత నిండుకుండలా మారడంతో నీటిని కిందకు వదులుతున్నారు.  ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. 

08 October 2022, 9:56 IST

సోమశిల దగ్గర వంతెన నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కృష్ణానదిపై సోమశిల దగ్గర వంతెన నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  రూ.1100 కోట్లతో తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సోమశిల నుంచి సిద్ధేశ్వరం వరకు 3 కి.మీ. వంతెన నిర్మాణానికి ఆమోదం  తెలిపింది. ఏపీ, తెలంగాణ మధ్య రోడ్డు మార్గ ప్రయాణానికి  దూరం తగ్గనుంది. 

08 October 2022, 9:56 IST

నేడు విజయవాడకు మల్లిఖార్జున ఖర్గే

ఏఐసిసి అధ్యక్ష రేసులో ఉన్న మల్లిఖార్జున ఖర్గే  నేడు రాష్ట్రానికి రానున్నారు.  ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకుంటారు.  రాష్ట్రంలో ఏఐసీసీ ప్రతినిధులను ఖర్గే మద్దతు కోరనున్నారు.  

08 October 2022, 9:56 IST

27వ రోజుకు చేరిన రైతుల పాదయాత్ర

 అమరావతి రైతుల మహాపాదయాత్ర 27వ రోజుకు చేరింది.   వీరవాసరం నుంచి పాలకొల్లు వరకు 15 కి.మీ.  పాదయాత్ర సాగనుంది.  పాదయాత్రకు స్వాగతం పలకడానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ భారీ ఏర్పాట్లు చేశారు. 

08 October 2022, 9:56 IST

విశాఖ రాజధానికి మద్దతుగా నేడు జేఏసీ ఏర్పాటు

విశాఖ రాజధానికి మద్దతుగా నేడు జేఏసీ ఏర్పాటు కానుంది.  అనంతరం వికేంద్రీకరణ అంశంపై  జేఏసీ సభ్యులు చర్చించనున్నారు. ఈ సమావేశానికి  మేధావులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు హాజరు కానున్నారు.  ఉదయం 11 గంటలకు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వికేంద్రీకరణపై చర్చా వేదిక  నిర్వహిస్తారు.   చర్చా కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుపై  చర్చిస్తారు.

    ఆర్టికల్ షేర్ చేయండి