తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh And Telangana Telugu Live News Updates October 04 2022
ఏపీ తెలంగాణ వార్తలు,
ఏపీ తెలంగాణ వార్తలు,

October 04 Telugu News Updates : సూర్యలంక సముద్రతీరంలో విషాదం.. ముగ్గురు మృతి

04 October 2022, 22:46 IST

  • దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ నవమి రోజు మహిషాసురమర్థినీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.అష్ట భుజాలతో దుష్టుడైన మ‌హిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. అందుకే ఇది నవదుర్గల్లో అత్యుగ్రరూపం. ఈ రోజున జగన్మాత కనకదుర్గమ్మ లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులను సాక్షాత్కరిస్తుంది. ఈ రోజు అమ్మవారికి గారెలు, బెల్లంతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా నివేదిస్తారు.

04 October 2022, 22:46 IST

షర్మిల పాదయాత్రో టీఆర్ఎస్ కార్యకర్తల ధర్నా

వైఎస్​ షర్మిల చేస్తున్న ప్రజా ప్రస్థాన పాదయాత్రలో కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. మెదక్​ జిల్లాలోని చేగుంట దగ్గర్లో పాదయాత్ర జరుగుతుండగా కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ కండువాలు ధరించి షర్మిల డౌన్​ డౌన్​ అంటూ నిరసన వ్యక్తం చేశారు.

04 October 2022, 22:44 IST

నదిలో పడిన 50 మందితో వెళ్తున్న బస్సు

ఉత్తరాఖండ్​ పౌరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రిఖినికల్ బిరోఖాల్ రహదారిపై వెళ్తున్న పెళ్లి బస్సు అదుపుతప్పి 300 మీటర్ల లోతున్న నాయర్ నదిలో పడింది. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. మిగతా వారి కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తోంది. సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

04 October 2022, 14:54 IST

సూర్యలంక సముద్రతీరంలో విషాదం.. ముగ్గురు మృతి

బాపట్లలోని సూర్యలంక సముద్రతీరంలో విషాదం జరిగింది. సరదాగా సముద్రస్నానం చేసేందుకు వచ్చిన ఏడుగురు యువకుల్లో ముగ్గురు మృతి చెందారు. విజయవాడకు చెందిన ఏడుగురు విద్యార్థులు సూర్యలంక తీరానికి వెళ్లారు. సముద్ర స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. సిద్ధూ, అభి, సాయిమధు మృతదేహాలు ఒడ్డుకు వచ్చాయి. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరి కోసం పోలీసులు, గజఈతగాళ్లు గాలిస్తున్నారు.

04 October 2022, 13:30 IST

రేపు టిఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశం

హైదరాబాద్‌లో  రేపు ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఈ కార్యక్రమానికి  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి  హాజరు కానున్నారు.  రేపు మధ్యాహ్నం 1.19కి జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.  జాతీయ పార్టీ ప్రకటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు  నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.  జాతీయ పార్టీపై ఎల్లుండి ఈసీకి టీఆర్ఎస్ అఫిడవిట్ సమర్పించనుంది. 

04 October 2022, 11:53 IST

అంజు యాదవ్‌పై మహిళా కమిషన్ సీరియస్

మహిళా పోలీసు అధికారి తీరుపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.   శ్రీకాళహస్తిలో ఓ మహిళపై మహిళా పోలీసు అధికారి వ్యవహరించిన తీరును సీరియస్‍గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్  నోటీసులు జారీ చేసింది. టీడీపీ నాయకురాలు  వంగలపూడి అనిత ఫిర్యాదుకు స్పందించిన మహిళా కమిషన్, - బాధ్యులైన మహిళా పోలీస్ అధికారిపై FIR నమోదు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. 

04 October 2022, 11:12 IST

తెప్పోత్సవం రద్దు

వరద ప్రవాహం కారణంగా కృష్ణా నదిలో నౌకా విహారం రద్దు చేశారు.  ఎగువ ప్రాంతం నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వస్తుండటంతో  ప్రకాశం బ్యారేజీ వైపు  వరద ప్రవాహం కొనసాగుతోంది.   పులిచింతలలో ఇప్పటికే 42 టీఎంసీల నీటినిల్వ ఉండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.   మరో 3 రోజుల పాటు  ఎగువ నుంచి  వరద ఉద్ధృతి కొనసాగనుంది.  అన్ని ప్రాజెక్టుల్లోనూ పూర్తిస్థాయిలో నీటినిల్వ ఉండటంతో హంస వాహనంపై అమ్మవారి విహారం సాధ్యపడదని అధికారులు స్పష్టం చేశారు.  వరుసగా మూడో ఏడాది  దుర్గా మల్లేశ్వర స్వామి నౌకా విహారం జరుగుతోంది.  దుర్గా ఘాట్ వద్ద హంస వాహనంపైనే పూజలు  నిర్వహించనున్నారు.   నౌకా విహారంపై కలెక్టర్ ఢిల్లీరావు, జలవనరుల శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. 

04 October 2022, 10:41 IST

టీఆర్‌ఎస్‌కు విఆర్‌ఎస్‌ తప్పదన్న జైరామ్‌ రమేష్‌

మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించారని,  బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రకటించారని,  అధికారంలోకి వచ్చాక వెంకయ్యనాయుడు ఏం చేశారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ కాదు.. టీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ తప్పదన్నారు.   రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే ఉంటుందని చెప్పారు. – భారత్ జోడో యాత్ర విజయవంతం చేయాలని జైరామ్ రమేష్ చెప్పారు. 

04 October 2022, 10:02 IST

కర్నూలులో రాహుల్ భారత్ జోడో యాత్ర

ఏపీలో భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై   కాంగ్రెస్ జాతీయ నేతలు దిగ్విజయ్ సింగ్, ఉమెన్ చాందీ, జైరాం రమేష్‌లు కర్నూలు చేరుకున్నారు.  ఉదయం తొమ్మిది గంటలకు కర్నూలు కాంగ్రెస్ ఆఫీస్ లో సమావేశం కానున్నారు.  రాహుల్ భారత్ జోడో యాత్ర షెడ్యూల్ పై చర్చించనున్నారు.  ఈనెల 17 నుంచి 21 వరకు కర్నూలు భారత్‌ జోడో యాత్ర సాగనుంది.  కర్నాటక నుంచి క్షేత్రగుడి దగ్గర జిల్లాలోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది.   ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు మీదుగా తెలంగాణలోకి  రాహుల్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. 

04 October 2022, 10:02 IST

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం  పడుతోంది.  సోమవారం శ్రీవారిని 82,815 మంది భక్తులు  దర్శించుకున్నారు.  సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.05 కోట్లుగా ఉంది. 

04 October 2022, 10:02 IST

బంగాళాఖాతంలో అల్ప పీడనం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.  అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి ఏర్పడటంతో  కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురువనున్నాయి.  రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. 

04 October 2022, 10:02 IST

ఎన్జీటీ జరిమానాా…

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. ఘన  వ్యర్థాల నిర్వహణలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలు, తీర్పులను అమలు చేయకపోవడంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం  వ్యక్తం చేసింది.   తెలంగాణకు రూ.3,800 కోట్లు జరిమానా విధించింది.  రెండు నెలల్లో ప్రత్యేక అకౌంట్ లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.  వ్యర్థాల నిర్వహణకు సత్వర చర్యలు చేపట్టి పురోగతి తెలపాలని ఆదేశించింది. 

    ఆర్టికల్ షేర్ చేయండి