తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  August 22 Telugu News Updates : వైసీపీ పరిపాలన రాష్ట్రానికి హానికరం.. పవన్ కల్యాణ్
ముఖ్యమంత్రిని థానోస్‌గా అభివర్ణించిన పవన్ కళ్యాణ్‌
ముఖ్యమంత్రిని థానోస్‌గా అభివర్ణించిన పవన్ కళ్యాణ్‌

August 22 Telugu News Updates : వైసీపీ పరిపాలన రాష్ట్రానికి హానికరం.. పవన్ కల్యాణ్

22 August 2022, 22:22 IST

  • అవెంజర్స్‌ సినిమా థానోస్ పాత్ర మాదిరి ఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్యామ్నయం అవసరమని, ప్రజారాజ్యం విషయంలో జరిగిన పొరపాటు జనసేన విషయంలో జరగదని ప్రకటించారు. కోవర్టుల వల్ల ప్రజారాజ్యం నష్టపోయిందని, వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వకుండా చూడ్డానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

22 August 2022, 22:21 IST

వైసీపీ పరిపాలన రాష్ట్రానికి హానికరం..

వైసీపీ పరిపాలన రాష్ట్రానికి హానికరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సెప్టెంబరు నుంచి పార్టీలో నిర్మాణ లోపాలు సరిదిద్దుకుంటామని చెప్పారు. పార్టీలో క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఒక కులాన్ని పట్టుకుని ముందుకెళ్లలేమన్న పవన్.. అన్ని కులాల సహకారంతోనే ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జీరో బడ్జెట్ ఎన్నికలు సాధ్యం కాదని.. డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికలు జరుగుతాయా? అని ప్రశ్నించారు.

22 August 2022, 22:19 IST

కవితతో రాజీనామా చేయించాలి

లిక్కర్‌ స్కామ్‌లో తప్పుడు ఆరోపణలంటున్న కవిత రాజీనామా చేసి విచారణకు సహకరించాలని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ కేటీఆర్‌, కవితపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటామన్నారన్నారు. కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కవితతో రాజీమానా చేయించాలన్నారు.

22 August 2022, 19:24 IST

అమిత్ షా-ఎన్టీఆర్ భేటీపై కిషన్ రెడ్డి క్లారిటీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్​తో సమావేశం కావడం వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి స్పందించారు. దాదాపు 45 నిమిషాల సేపు సాగిన సమావేశంలో సినిమాల గురించి మాత్రమే చర్చ జరిగిందన్నారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నారన్నారు.

22 August 2022, 17:25 IST

కూకట్‌పల్లి జేఎన్​టీయూ వద్ద ఉద్రిక్తత

కూకట్‌పల్లి జేఎన్​టీయూ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో క్రెడిట్, డిస్టెన్స్, గ్రేడ్ మార్కులు వెనక్కితీసుకోవాలని యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఎన్ఎస్​యూఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేయడంతో పోలీసులు సముదాయించే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో వారిని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు పోలీసులు. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది.

22 August 2022, 13:44 IST

రేపు విద్యాసంస్థలు బంద్…

ఆంధ్రప్రదేశ్‌లో  ఈనెల 23న తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థల బంద్ కానున్నాయి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు పుస్తకాలు , యూనిఫాం ఇవ్వకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 23న విద్యాసంస్థలు బంద్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటిచారు.

22 August 2022, 13:31 IST

కొడాలి నాని కామెంట్స్‌

కేంద్ర మంత్రి  అమిత్‍షా - జూ.ఎన్టీఆర్ భేటీపై వైసీపీ నేత కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.  పనిలేకుండా మోదీ, అమిత్‍షా నిమిషం కూడా మాట్లాడరని బీజేపీని విస్తరించేందుకే భేటీ అయ్యారనుకుంటున్నా చెప్పారు.  ఎన్టీఆర్ మద్దతు కోసం అమిత్‍షా ప్రయత్నిస్తుండవచ్చన్నారు.  పాన్‍ఇండియా స్టార్ అయిన జూ.ఎన్టీఆర్‍తో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశాలు లేకపోలేదన్నారు. రెండు తెలుగు  రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడానికి ఎన్టీఆర్ సేవల్ని వాడుకోవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. 

22 August 2022, 13:21 IST

లిక్కర్‌ స్కాంతో సంబంధం లేదు

ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ బిడ్డను కాబట్టి తనను టార్గెట్ చేశారని, ఇలాంటి విమర్శలకు తాను బెదిరిపోనని చెప్పారు. ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమని ప్రకటించారు. 

22 August 2022, 11:26 IST

ముంబైలో శ్రీవారి ఆలయ భూమి పూజ వాయిదా

ముంబైలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణం వాయిదా పడింది.  ఆదివారం నిర్వహించాల్సిన భూమి పూజ అనివార్య కారణాలతో ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబైలో 10ఎకరాల భూమిని టీటీడీ ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చింది. రేమాండ్స్‌ సంస్థ నిర్మాణ వ్యయం భరించేందుకు  ముందుకు వచ్చారు.  భూమికి సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో తాత్కలికంగా భూమి పూజ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. త్వరలో  మరో తేదీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

22 August 2022, 10:54 IST

502 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీలో వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 502 పోస్టులను భర్తీ చేయనున్నారు.   స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, మ్యూజిక్‌ ఉపాధ్యాయులు, ఆర్ట్‌ ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌-స్కూల్‌ అసిస్టెంట్స్‌), ఏపీ మోడల్‌ స్కూల్స్‌, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకానికి గాను ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు.  పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 23వ తేదీన cse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు  పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. 

22 August 2022, 10:49 IST

చిరంజీవికి పుట్టిన రోజు శుభాకంక్షలు చెప్పిన చంద్రబాబు

సినీనటుడు  చిరంజీవికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు  పుట్టినరోజు శుభాకాంక్షలు  తెలిపారు.  మెగాస్టార్‍గా ప్రేక్షకుల హృదయాల్లో స్థిరపడిన నటుడని అభివర్ణించారు.  చిరంజీవి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని,  నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నానని  టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు.

22 August 2022, 10:48 IST

ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ

ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఏపీ సీఎం జగన్ వెంట ఎంపీ విజయసాయిరెడ్డి  ఉన్నారు. పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని వినతి చేశారు.  నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని త్వరితగతిన ఇవ్వాలని విజ్ఞప్తి  చేస్తున్నారు.   ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

22 August 2022, 8:51 IST

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్

హత్య కేసులో అరెస్టైన్‌ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‍పై  నేడు విచారణ జరుగనుంది. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23న అనంతబాబును  పోలీసులు  అరెస్ట్‌ చేశారు.  అనంతబాబు రిమాండ్ గడువు ముగియనుండటంతో బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపనున్నారు. మరోవైపు అనంతబాబు తల్లి ఆదివారం మరణించడంతో మానవతా ధృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

22 August 2022, 8:51 IST

జనసేన పిఏసీ భేటీ

 మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో  ఉదయం 11 గంటలకు జనసేన పీఏసీ భేటీ కానుంది. జనవాణి కార్యక్రమ నిర్వహణతో పాటు   కౌలు రైతు భరోసా యాత్ర, రోడ్ల పరిస్థితి, డిజిటల్ ప్రచారంపై  పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ రాష్ట్ర  పర్యటనపై కూడా పిఏసీలో చర్చించనున్నారు. 

22 August 2022, 8:51 IST

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది.   ఏడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు.  శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 81,523 మంది భక్తులు దర్శించుకున్నారు.  37,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.  ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.65 కోట్లు వచ్చింది. నేడు  ఆన్‍లైన్‌లో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల  చేయనున్నారు. 

22 August 2022, 8:51 IST

ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్

ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.  ఉదయం 10 గంటలకు ప్రధానితో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.  ప్రధానంగా పోలవరంపై ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధానితో చర్చిస్తారని చెబుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, ఆర్థికసాయం కోరే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో  పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. 

    ఆర్టికల్ షేర్ చేయండి