తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh And Telangana Telugu Live News Updates 29 November 2022
అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌
అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌

November 29 Telugu News Updates : అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌ హాజరు

29 November 2022, 22:16 IST

  • సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును కడప జిల్లా నుంచి హైదరాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు సుప్రీం కోర్టు బదిలీ చేసింది. వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయ స్థానం కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది.  ఆంధ్రప్రదేశ్‌లో దర్యాప్తుతో తమకు న్యాయం జరగదని వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి  కొద్ది నెలల క్రితం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

29 November 2022, 22:13 IST

అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌ హాజరు

సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌ హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అలీ దంపతులతో కాసేపు జగన్ మాట్లాడారు. మంగళవారం సాయంత్రం గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లోని శ్రీకన్వెన్షన్‌లో రిసెప్షన్‌ జరిగింది.

29 November 2022, 14:38 IST

మొబైల్‌ ఛార్జింగ్‌ తీస్తుండగా షాక్‌ తగిలి చిన్నారి మృతి

గద్వాల్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్‌ ఫోన్‌ తీస్తుండగా షాక్‌ తగిలి నిహారిక అనే చిన్నారి చనిపోయిది. అయిజ మండలం ఈడిగొనిపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిహారికకు పదేళ్లు. 4వ తరగతి చదువుతుంది. కూతురు అకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

29 November 2022, 13:40 IST

చిత్తూరు కోర్టు తీర్పు నిలిపివేసిన హైకోర్టు…

పదో తరగతి ప్రశ్నల లీకేజీ వ్యవహారంలో చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి నారాయణను కోర్టులో లొంగిపోవాలని ఇటీవల చిత్తూరు సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది.  సెషన్స్ కోర్టు ఆదేశాలపై హైకోర్టును  మాజీమంత్రి నారాయణ  ఆశ్రయించారు.  ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు,  తీర్పు వచ్చేవరకూ చిత్తూరు కోర్టు ఉత్తర్వులు నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది. 

29 November 2022, 13:38 IST

చంద్రబాబు ట్వీట్….

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్‌లో స్పందించారు. ‘‘సొంత బాబాయ్‌ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయింది. అది కూడా నువ్వు సీఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ?’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం పదవికి జగన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

29 November 2022, 13:38 IST

ఎస్సార్‌ నగర్‌ పిఎస్‌కు షర్మిల తరలింపు…

పంజాగుట్ట యశోదా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన వైఎస్‌ షర్మిలను వాహనంతో  సహా ఎస్సార్‌ నగర్‌ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో వాహనంలో ఉన్న షర్మిలను అందులో ఉంచి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నర్సంపేటలో పాదయాత్రలో తనపై దాడి చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్  షర్మిల ఆందోళనకు దిగారు. 

29 November 2022, 13:35 IST

సోమాజిగూడలో ఉద్రిక్తత

సోమాజిగూడ నుంచి ప్రగతి భవన్‌ వెళ్లేందుకు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను  పంజాగుట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  షర్మిల పాదయాత్రను టిఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకోవడంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు బయల్దేరిన షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో పంజాగుట్ట-సోమాజిగూడ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో షర్మిల వాహనాన్ని పోలీసులు క్రేన్ సాయంతో తరలించారు. ఆ సమయంలో ఆమె వాహనంలోనే ఉన్నారు. వాహనం దిగేందుకు అంగీకరించకపోవడంతో పోలీసులు వాహనాన్ని  క్రేన్ సాయంతో తరలించారు. 

29 November 2022, 12:39 IST

రేపు మదనపల్లెలో సిఎం పర్యటన

ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ రేపు అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి నాలుగో త్రైమాసిక నిధులను విడుదల చేయనున్నారు.  ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు మదనపల్లె బీటీ కాలేజ్‌ గ్రౌండ్స్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి టిప్పు సుల్తాన్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి నాలుగో త్రైమాసిక నిధులను విడుదల చేయనున్నారు. కార్యక్రమం అనంతరం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

29 November 2022, 12:02 IST

ఆటోను ఢీకొన్న బస్సు, డ్రైవర్ మృతి

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని డివిఎన్ కాలనీ వద్ద జాతీయ రహదారిపై గుంటూరు నుండి త్రిపురాంతకం వైపు ఎరువుల లోడుతో వెళ్తున్న ఆటో ను మార్కాపురం నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్ అక్కడిక్కడే మృతిచెందగా బస్సులో ప్రయాణిస్తున్న పన్నెండుమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

29 November 2022, 11:22 IST

సిట్ నోటీసుల్లో రఘురామకు ఊరట…

టీఆర్‍ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎంపీ రఘురామకు సిట్ ఊరటనిచ్చింది.  ఇవాళ విచారణకు రావాల్సిన అవసరం లేదని తెలంగాణ సిట్ అధికారి  తెలిపారు.  ఎంపీ రఘురామకు మెయిల్ ద్వారా సమాచారం పంపారు. 

29 November 2022, 11:21 IST

సర్పంచుల సమర శంఖారావం

తిరుపతిలో "సర్పంచుల సమర శంఖారావం" పేరుతో నిరసనలకు దిగారు.  నిరసన కార్యక్రమానికి ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపునిచ్చింది.  గ్రామాల అభివృద్ధిపై సర్పంచుల సమర శంఖారావం పేరుతో నిరసన చెబుతున్నారు.  సర్పంచుల 12 డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.  అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. - తిరుపతిలో పలువురు ఏపీ సర్పంచ్‍ల సంఘం నేతల హౌస్ అరెస్ట్ చేశారు. సర్పంచుల నిరసన అడ్డుకోడానికి  అలిపిరి దగ్గర భారీగా పోలీసులు మొహరించారు.

29 November 2022, 11:20 IST

చెక్ డ్యామ్ పేల్చేసిన రైతు

ప్రకాశం జిల్లా డోర్నాలలో నల్లవాగుపై నిర్మించిన చెక్ డ్యామ్‍ను  రైతు పేల్చివేశాడు. జిలెటిన్ స్టిక్స్ తో చెక్‍డ్యామ్‍ను పేల్చివేయడంతో  స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.  నల్లవాగుపై రూ.9.50 లక్షలతో చెక్‍డ్యామ్ నిర్మాణం జరిగింది. - ధ్వంసమైన చెక్‍డ్యామ్‍ను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు, రైతు మల్లికార్జునపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  నిందితుడు పరారయ్యాడు. 

29 November 2022, 11:19 IST

తిరుమలలో లడ్డూల కొరత

శ్రీవారి ప్రసాదం కోసం తిరుమలలో భక్తులు అవస్థలు పడుతున్నారు. లడ్డూల కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  శ్రీవారి ప్రసాదం కౌంటర్ల దగ్గర భారీగా క్యూలైన్లు ఏర్పడ్డాయి.  లడ్డూల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

29 November 2022, 11:17 IST

ఉద్యోగాల పేరుతో మోసం

ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల పేరుతో మోసం విశాఖ పట్నంలో ఓ మహిళ నిరుద్యోగుల్ని మోసం చేసింది.  నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన పద్మపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితురాలు పద్మతో పాటు నలుగురు నిందితులను పోలీసులు  అరెస్ట్ చేశారు. 

29 November 2022, 11:16 IST

జిల్లా ఎస్పీని కలిసిన మాజీ మంత్రి చినరాజప్ప, టీడీపీ నేతలు

జిల్లా ఎస్పీని కలిసిన మాజీ మంత్రి చినరాజప్ప, టీడీపీ నేతలు,  ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.  రెచ్చిపోయే వారిని జగన్ సపోర్ట్ చేస్తున్నారని,   టీడీపీ నేతలను అణగదొక్కాలని పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించారు.   చంద్రబాబు, లోకేశ్‍పై ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడు రెచ్చిపోయి మాట్లాడారని,   రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదని ఆరోపించారు.  జాకీ పరిశ్రమ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నాడని  మాజీ హోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు. 

29 November 2022, 11:22 IST

నేడు గుంటూరులో సిఎం జగన్ పర్యటన

నేడు  సీఎం జగన్ గుంటూరులో పర్యటించనున్నారు.  సినీనటుడు అలీ కూతురి రిసెప్షన్‍కు హాజరుకానున్నారు. అలీ కుమార్తె పెళ్లి రిసెప్షన్‍కు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.  సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

    ఆర్టికల్ షేర్ చేయండి