AP Accidents : విహారయాత్రలో విషాదం, ముగ్గురిని మింగేసిన సముద్రం
03 June 2024, 15:44 IST
- AP Accidents : ఏపీలో విహారయాత్రలు విషాదాన్ని నింపాయి. రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు.
విహారయాత్రలో విషాదం, ముగ్గురిని మింగేసిన సముద్రం
AP Accidents : సరదాగా విహారయాత్రకు వెళ్లిన ముగ్గురిని సముద్రం మింగేసింది. రాష్ట్రంలో రెండు వేర్వేరు ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరణించిన వారిలో ఒక ఘటనలో ఇద్దరు మహిళలుండగా, ఒక ఘటనలో 17 ఏళ్ల యువకుడు ఉన్నాడు. ఈ ఘటనలు అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగాయి.
అనకాపల్లి జిల్లాలో విహారయాత్ర తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన వారిని, అంతలోనే మృత్యువు కెరటం రూపంలో బలి తీసుకుంది. దీంతో వారిలో ఆనందం ఆవిరైపో, అనంత లోకానికి చేరుకున్నారు. అక్కాచెల్లెళ్లులైన అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తీడకు చెందిన ఎన్.కనకదుర్గ (27), మాకవరపాలెం మండలం శెట్టిపాలేనికి చెందిన ఎండపల్లి నూకరత్నం (24)తో పాటు ఎలమంచిలి మండలం గొల్లలపాలేనికి చెందిన ద్వారంపూడి శిరీష (23) తమ కుటుంబానికి చెందిన మరో ఐదుగురితో కలిసి తంతడి వాడపాలెం బీచ్‌కు వెళ్లారు. అందరూ బీచ్‌లో ఫొటోలో తీసుకుంటున్నారు.
అయితే శిరీష, నూకరత్నం, కనకదుర్గ మాత్రం సముద్రతీరాన్ని ఆనుకొని ఉన్న కొండరాళ్లపై నిలుచుని ఫొటో తీసుకుంటున్నారు. అదే సమయంలో సముద్రపు కెరటం వీరిపై ఎగిసిపడింది. అలల ఉద్ధృతికి ముగ్గురు నీటిలో మునిగిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు వీరిని రక్షించడానికి ప్రయత్నించారు. మత్స్యకారులు సముద్రంలోకి దూకి గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది సేపటికే ఆ ముగ్గురిని ఒడ్డుకు తీసుకొచ్చారు. వెంటనే స్థానిక అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రి చేరే లోపే కనకదుర్గ, నూకరత్నం మృతి చెందారు. శిరీష ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతుంది.
శ్రీకాకుళంలో యువకుడు మృతి
శ్రీకాకుళం జిల్లాలో విహారయాత్రలో విషదం చోటు చేసుకుంది. బీచ్‌లో సరదాగా గడుపుదామని వెళ్లిన యువకుడికి విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. బంధువులు, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సారవకోట మండలం మర్రిపాడుకు చెందిన జెన్ని ఉపేంద్ర (17) సముద్రం అలలకు కొట్టుకుపోయాడు. మర్రిపాడుకు చెందిన దాదాపు 50 మంది భావనపాడు బీచ్‌కు వెళ్లారు. అందులో నలుగురు సముద్రంలో దిగి స్నానాలు చేస్తున్నారు. కొద్దిసేపటికే సముద్రపు అలలకు నలుగురు కొట్టుకుపోయారు. అందులో ముగ్గురు అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు. ఉపేంద్ర మాత్రం ఎంతకీ రాలేదు. దీంతో బంధువులు, స్నేహితులు మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంట సేపు గాలించినప్పటికీ ఉపేంద్ర ఆచూకీ లభించలేదు. గంట తరువాత ఉపేంద్ర మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఉపేంద్ర పలాసలో ఐటిఐ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఉపేంద్ర తల్లిదండ్రులు అప్పలమ్మ, చలపతిరావు కన్నీరుమున్నీరు అయ్యారు.
రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు యువకులు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం విస్సన్నపేట గ్రామానికి చెందిన దోమరౌతు ఈశ్వరరావు (32), తూరిబిల్లి భాస్కరరావు (33) గ్రామానికి దగ్గరిలో ఉన్న పరంటమ్మలోవకు వెళ్లి, తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఉన్న రాళ్లు బలంగా తగలడంతో మృతి చెందారు.
విశాఖ నుంచి విజయనగరం వెళ్లే రహదారిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు భోగాపురం మండలం చింతలవలస సమీపంలో బొడ్డువలస పెట్రోల్ బంక్ వద్ద వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మృతులిద్దరూ చింతల వలస గ్రామానికి చెందినవారే. దేబార్కి శరత్ కుమార్ (26), కర్తు శివప్రసాద్ (25) పల్సర్ ద్విచక్ర వాహనంపై భీమిలి నుంచి తిరిగి వస్తున్నారు. శివప్రసాద్ డ్రైవింగ్ చేస్తుండగా, శరత్ కుమార్ వెనుక కూర్చున్నాడు. బొడ్డువలస పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి ముందు వెళ్తున్న వాహనాన్ని బలంగా ఢీ కొట్టారు. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడి అక్కడిక్కడే మృతి చెందారు. కుమారుడు ఇంకా ఇంటికి రాలేదని శివ ప్రసాద్ తల్లి లక్ష్మి ఫోన్ చేయగా, వేరొకరు ఫొటో తీసి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసింది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు