NC23: మత్స్యకారుడి నిజ జీవిత కథతో నాగచైతన్య తదుపరి మూవీ.. శ్రీకాకుళంలోని గ్రామానికి వెళ్లిన హీరో: వీడియో
NC23: యంగ్ హీరో నాగ చైతన్య ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో తదుపరి చిత్రం చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీలో మత్స్యకారుడిగా అతడు కనిపించనున్నాడు. వివరాలివే..
NC23: యువ సామ్రాట్ నాగచైతన్య విభిన్నమైన కథాంశంతో తదుపరి చిత్రం చేయనున్నట్టు వెల్లడైంది. పాకిస్థాన్ చెరలో బందీగా మారి రెండేళ్ల తర్వాత విడుదలైన ఉత్తరాంధ్ర మత్స్యకారుడి పాత్రను ఆ చిత్రంలో నాగచైతన్య పోషించనున్నాడు. ఇది నాగచైతన్యకు 23వ చిత్రం (NC23)గా ఉండనుంది. కార్తికేయ-2తో పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయిన డైరెక్టర్ చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే చైతూ - చందూ కాంబినేషన్‍లో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి చందూ డైరెక్షన్‍లో మూవీ చేయనున్నాడు నాగచైతన్య. 100% లవ్ తర్వాత మరోసారి గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చైతూ ఈ సినిమా చేస్తున్నాడు. కాగా, NC23 మూవీ కోసం నాగ చైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాసు స్వయంగా మత్స్యకారులను కలిశారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కే.మత్స్యలేశం గ్రామానికి నాగ చైతన్య, చందూ, బన్నీ వాసు సహా మరికొందరు మూవీ టీమ్, పీఆప్ టీమ్ సభ్యులు వెళ్లారు. అక్కడ ఉన్న మత్స్యకారులతో మాట్లాడారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి జీవన విధానం, భాష, యాస, పదాలు, పనులు సహా మరిన్నింటికి గురించి తెలుసుకున్నాడు నాగ చైతన్య. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.
2018లో గుజరాత్‍లో చేపల వేటకు వెళ్లిన 21 మంది మత్య్సకారులను పాకిస్థాన్ కోస్టుగార్డు సిబ్బంది అరెస్టు చేశారు. భారత ప్రభుత్వ కృషితో రెండేళ్ల తర్వాత వారు విడుదలయ్యారు. వారిలో కే మత్స్యలేశం గ్రామానికి చెందిన రామారావు కూడా ఒకరు. ఆయన కథ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. మత్స్యకారుడు రామారావు పాత్రను నాగ చైతన్య పోషించనున్నాడు. పాకిస్థాన్ చెరలో మత్స్యకారులు పడిన కష్టాలు, మానసిక సంఘర్షణ, ఇండియాకు తిరిగి రావడం లాంటి ఘటనలు ఈ మూవీలో ఉండనున్నాయని తెలుస్తోంది. గుజరాత్, ఉత్తరాంధ్రలోనే ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం.
100% లవ్ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మళ్లీ ఈ సినిమా చేస్తున్నాడు చైతన్య. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ మూవీ రూపొందనుంది.
కాగా, నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీతో చైతూ తమిళంలోనూ అడుగుపెట్టినా.. ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.