HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan : చంద్రబాబు సర్కార్ పై వ్యతిరేకత మొదలైంది, భయాలతోనే కూటమి పాలన - వైఎస్ జగన్

YS Jagan : చంద్రబాబు సర్కార్ పై వ్యతిరేకత మొదలైంది, భయాలతోనే కూటమి పాలన - వైఎస్ జగన్

22 July 2024, 16:43 IST

    • YS Jagan : చంద్రబాబు ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో భయం కనిపిస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం కనీసం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేని పరిస్థితిలో ఉందన్నారు. ఈ నెల 24న దిల్లీలో ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు.
చంద్రబాబు సర్కార్ పై వ్యతిరేకత మొదలైంది, భయాలతోనే కూటమి పాలన - వైఎస్ జగన్

చంద్రబాబు సర్కార్ పై వ్యతిరేకత మొదలైంది, భయాలతోనే కూటమి పాలన - వైఎస్ జగన్

YS Jagan : ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేవలం 50 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందన్నారు. కూటమి పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని వైఎస్ జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే.. 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్‌ కూడా ప్రవేశపెట్టలేక పోతోందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్‌ ఆన్‌ అకౌంట్ మీదే నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుందన్నారు.

భయంతో పాలన

ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ, మభ్య పెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితిలో కూటమి సర్కార్ ఉందని వైఎస్ జగన్ విమర్శించారు. అందుకే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారంటే..పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుందన్న భయం మొదలైందన్నారు. ఎన్నికల్లో చేసిన మోసపూరిత హామీలు, అమలు చేయని పరిస్థితిలో, ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయం చంద్రబాబులో ఉందన్నారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించి భయానక పరిస్థితి సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. చేస్తూ ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదనే పరిస్థితి సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

ప్రతిపక్ష హోదాపై

"ప్రస్తుత అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం మరొకటి ప్రతిపక్షం. ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉంది. కాబట్టి ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలి. ఆ పార్టీ నాయకుడినే, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. కానీ ఆ పని చేస్తే.. అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అసెంబ్లీలో హక్కుగా మైక్‌ ఇస్తే, ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్షనేత ఎండగడతారని, వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో.. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదు" - వైఎస్ జగన్

ఈ నెల 24న దిల్లీలో ధర్నా

కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా, చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నారని జగన్ అన్నారు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా, చంద్రబాబు పాపాలు కూడా పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు దిల్లీకి వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని.. 24వ తేదీన దిల్లీ ఫొటో గ్యాలరీ.. ప్రొటెస్ట్‌ ద్వారా దేశం దృష్టికి, వివిధ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని, పరిస్థితులను చెప్పబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం కొనసాగిస్తామని జగన్ ట్వీట్ చేశారు.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్