TDP : ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి, జగన్ సర్కార్ పై టీడీపీ పోస్టర్లు కలకలం
TDP : వైసీపీ పాలనపై టీడీపీ మొదలుపెట్టిన నాలుగేళ్ల నరకం కార్యక్రమంలో... రెండు రోజు పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని గణాంకాలతో సహా పోస్టర్లు అంటించారు.
TDP : వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టిన 'నాలుగేళ్ల నరకం' ప్రచార కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగేళ్ల నరకం పోస్టర్లు వెలిశాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొంటూ గణాంకాలతో పలు ప్రాంతాల్లో టీడీపీ మద్దతుదారులు పోస్టర్ల అతికించారు. ప్రధానంగా గుంటూరు, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఒంగోలు రైల్వేస్టేషన్ వంటి కీలక ప్రాంతాలలో పోస్టర్లు వెలిశాయి. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు, మహిళలపై దాడులు, ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, పీజీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల తొలగింపు, రైతు ఆత్మహత్యలు, ఆగిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, MNC కంపెనీల తరలింపు, నిరుద్యోగం అంశాలను పోస్టర్‌లపై హైలైట్ చేశారు.
మహిళలపై దాడులు
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ ఆరోపిస్తుంది. మహిళలపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు పెరిగిపోయాయని విమర్శించింది. మహిళలపై దాడుల సంఖ్య 2020లో 7,039 ఉండగా 2021లో 10,373 నుంచి 2022 నాటికి 11,895కు పెరిగాయని పేర్కొంది. మహిళలకు మరింత రక్షణ కల్పించాల్సిన 'దిశ' చట్టం ఇప్పటికీ అమలు కావడంలేదని టీడీపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. 2023లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 77 శాతంగా నమోదైందని, దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపింది. అంతకుముందు టీడీపీ హయాంలో ఉత్తీర్ణత శాతం ఎప్పుడూ 90శాతం కిందకు పడిపోయిన దాఖలాలు లేవని పేర్కొంది. పీజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్ షిప్‌లను రద్దు చేసిందని టీడీపీ ఆరోపింది. దీంతో పీజీ విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో చదువుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. అంతేకాదు ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు కూడా పెంచకపోవడంతో విద్యార్థులు మరింత ఇబ్బందులకు విద్యార్థులు గురవుతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది.
రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానం
'రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. గడిచిన నాలుగేళ్లలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పక్క రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ ఖరీదు రూ.15,000 కాగా, రాష్ట్రంలో రూ. 36,000లుగా ఉంది. ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై తక్కువ పెట్టుబడి, పెరిగిన నిరుద్యోగం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ కాలేజీలకు సూపరింటెండెంట్లు కూడా లేరు. ప్రభుత్వ వేధింపుల వల్ల 53 పరిశ్రమలు రాష్ట్రం విడిచివెళ్లిపోయాయి. కనీసం 0.5% విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదు. చిత్తూరు డెయిరీ ఆస్తులను 99 ఏళ్లకుగాను అమూల్ సంస్థకు అప్పగించారు. గడిచిన నాలుగేళ్లలో ఉద్యోగాల క్యాలెండర్ ఎక్కడ వేసిన గొంగిలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఒక్క డీఎస్సీ పరీక్ష కూడా జరగలేదు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత యువతలో నిరుద్యోగ రేటు 35.1 శాతంగా ఉంది.'- టీడీపీ
సోషల్ మీడియాలో
వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వంపై సామజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో నాలుగేళ్ల నరకం క్యాంపెయిన్‌ను మరింత విస్తృతం చేస్తామంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి జగన్ ప్రభుత్వ తీరును ఎండగడతామంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను #NalugellaNarakam అనే హ్యాష్‌ట్యాగ్‌లో విస్తృతంగా షేర్ చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపు నిచ్చింది.