Pawan Kalyan : త్వరలో గ్రామాల్లో కొత్త రోడ్లు, ఉన్న వాటికి మరమ్మతులు- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
05 August 2024, 14:58 IST
- Pawan Kalyan : కలెక్టర్లతో సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగే ఉద్యమాన్ని అధికారులు భాగం కావాలన్నారు.
త్వరలో గ్రామాల్లో కొత్త రోడ్లు, ఉన్న వాటికి మరమ్మతులు- డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan : పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలనలో చూశామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు... మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో సంచలన తీర్పు ఇచ్చారని, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుని వారికి న్యాయం చేయాలన్నారు. గత ప్రభుత్వం ఎన్నో అవమానాలు ఎదురైనా అన్నింటినీ తట్టుకుని, వ్యవస్థనలు బతికించాలని నిలబడ్డామన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చిందన్నారు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. గ్రామ పంచాయతీలను బలోపేతమే లక్ష్యంగా ఒకేరోజు రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. లిక్విడ్ వేస్ట్ మేనెజ్మెంట్ పైలెట్ ప్రాజెక్టుగా మొదట పిఠాపురం నియోజకవర్గంలో చేపడుతున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి
కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలతో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పవన్ కల్యాణ్ సూచించారు. 97 శాతం విన్నింగ్ రేట్‌తో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. అనేక బాధలు, ఇబ్బందులు పడి గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దేందుకు ఈ ప్రభుత్వాన్ని స్థాపించామని పేర్కొన్నారు. మాది మంచి ప్రభుత్వమని, పాలనలో పారదర్శకత ఉంటుందన్నారు. అధికారంలోకి రాకపోయినా ప్రజాస్వామ్యం కోసం నిలబడేవాళ్లమన్నారు. ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో గత ఐదేళ్లుగా మన రాష్ట్రాన్ని వైసీపీ మోడల్ స్టేట్‌గా చేసిందన్నారు. సీఎం చంద్రబాబు పాలనా అనుభవంతో రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కిస్తామన్నారు. గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, పిఠాపురంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ను పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామన్నారు. ఈ ఏడాది 5.40 కోట్ల గృహలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే గ్రామాల్లో కొత్త రోడ్లు, ఉన్న రోడ్ల మరమ్మతులు చేపడతామన్నారు. పశ్చిమగోదావరి, గుంటూరు, కర్నూలులో ఫారెస్ట్ కవర్ పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
వైసీపీ విధ్వంసంతో ఏపీకి తీవ్రనష్టం
గత ప్రభుత్వ విధ్వంసం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రంలో పాలనా వ్యవస్థ దారుణంగా తయారైందని పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కీలు బొమ్మలుగా మార్చిందన్నారు. దీంతో అన్ని వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఈ వ్యవస్థలను తిరిగి పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అధికారులు నిజాయితీగా పనిచేయాలని కోరారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం తరఫున పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. మీ పనిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల నుంచి సమస్యలు తలెత్తినా, మంత్రులలో ఏమైనా లోపాలు కనిపించినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వాటిని పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగే ఉద్యమాన్ని అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలెక్టర్లను కోరారు.
మా వాళ్లు అయినా సరే ఉపేక్షించొద్దు - సీఎం చంద్రబాబు
మానవతా కోణంలో ప్రజల సమస్యలను చూడాలని, ప్రజలను అవమానించేలా కాకుండా గౌరవప్రదంగా వారికి మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇసుక విషయంలో అవినీతి జరిగితే ఉపేక్షించవద్దన్నారు. టీడీపీ వాళ్లు అయినా సరే, అసలు ఉపేక్షించొద్దన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నాం, ఇప్పుడు రవాణా ఛార్జీలు తగ్గింపుపై దృష్టి పెట్టాలి, ఎక్కువ సేపు లారీలు క్యూలో లేకుండా చూడాలి. దీనికి ఏం చేయాలో ఆలోచిద్దామన్నారు. అవినీతికి మాత్రం ఆస్కారం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక కుంభకోణంపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామన్నారు.