తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly Session : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మాజీ సీఎం జగన్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ

AP Assembly Session : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మాజీ సీఎం జగన్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ

21 July 2024, 18:32 IST

google News
    • AP Assembly Session : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరవుతారా? లేదా? అనే చర్చ జరుగుతోంది.
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మాజీ సీఎం జగన్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మాజీ సీఎం జగన్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మాజీ సీఎం జగన్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ

AP Assembly Session : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెలఖారుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానుండడంతో మరో మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని తెలుస్తోంది. సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారని సమాచారం.

మూడు శ్వేతపత్రాలు

వైసీపీ పాలనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసింది. సీఎం చంద్రబాబు సచివాలయంలో శ్వేతపత్రాలు మీడియా సమక్షంలో విడుదల చేసి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలపై అసెంబ్లీ సమావేశాల్లో సభ చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం 8.30 గంటలకు వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్తారు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో అసెంబ్లీకి రావాలని టీడీఎల్పీ సూచించింది.

దిల్లీలో ధర్నా?

అసెంబ్లీ సమావేశాలకు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా మాజీ సీఎం జగన్ హాజరుపై సందిగ్ధం నెలకొంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు పెరిగాయని ఆ పార్టీ ఆరోపిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై దిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? దిల్లీలో ధర్నాకు వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో దిల్లీలో ధర్నా చేసి నేషనల్ మీడియా అటెన్షన్ పొందాలని వైసీపీ అధిష్టానం భావిస్తుందని తెలుస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యేలకు మంచి ఛాన్స్

ఈ నెల 22న గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఈ సమయంలో రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రభుత్వ పాలనపై మాట్లాడే అవకాశం లభిస్తుంది. అధికారపక్షాన్ని నిలదీసేందుకు ఈ సమయాన్ని ప్రతిపక్షాలు మంచి అవకాశంగా భావిస్తాయి. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారా? కూటమి పాలనపై అభ్యంతరాలు, రాష్ట్రంలో సమస్యలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. శాసనసభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించకుండా జగన్ డుమ్మా కొట్టే ఆలోచన చేస్తు్న్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సభకు డుమ్మాకొట్టాలనే వ్యూహంతో ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. అసలు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది.

సీట్ల కేటాయింపులో

అసెంబ్లీ సీట్ల కేటాయింపుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో సభ్యులు ఎక్కడైనా కూర్చొవచ్చు. దీంతో మాజీ సీఎం జగన్ కు ముందు వరుసలో సీటు కేటాయించే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. వైసీపీ ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో... జగన్ సాధారణ ఎమ్మెల్యేలాగానే సభకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ స్పీకర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే అందుకు తగిన స్థానాలు వైసీపీ గెలుచుకోలేదని, ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.

తదుపరి వ్యాసం