AP Assembly Sessions: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ఆ తర్వాతే 'బడ్జెట్' ఉండనుందా..?
20 July 2024, 9:33 IST
- AP Assembly Sessions 2024 : ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. మొదటిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024
AP Assembly Sessions 2024 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 22వ తేదీ నుంచి ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయసభల సమావేశాలు మొదలవనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఐదు రోజులపాటు సమావేశాలు…
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు శుక్రవారం సమావేశమయ్యారు. సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపై చర్చించారు.
ఈసారి సమావేశాలు ఐదు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ ఉండనుంది. గవర్నర్ ప్రసంగంతో తొలి రోజు సభ ముగియనుంది. సభలో మూడు అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. మద్యం, శాంతి భద్రతలు, ఆర్థిక అంశాలు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు…. నాలుగు అంశాలకు సంబంధించిన శ్వేతపత్రాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే.
బడ్జెట్ ఉంటుందా…?
అయితే ఈ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై ఆర్థికశాఖ తర్జన భర్జన పడుతోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో మూడు నాలుగు నెలలపాటు ఓటాన్ అకౌంట్ కొనసాగేలా ఆర్డినెన్స్ తేవాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది…!
23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
మరోవైపు ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. పార్లమెంట్ ఎన్నికల వేళ నాలుగు నెలల కాలానికి ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జరగబోయే సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు సాగనున్నాయి. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రానికి కేటాయింపులు బట్టి పూర్తిస్థాయి బడ్జెట్ ను సిద్ధం చేయనున్నారు. ఈనెల 25 లేదా 26 న పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
ఈ బడ్దెట్ సమావేశాల్లో రైతు భరోసా,రైతు రుణమాఫీ వంటి కీలక అంశాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయనున్న నేపథ్యంలో దీనిపై కూడా సభలో చర్చ జరగనుంది. ఇక రైతుభరోసా స్కీమ్ పై సభ్యుల నుంచి పలు సూచనలను స్వీకరించనుంది. అయితే వానాకాలం సాగు ప్రారంభమైనప్పటికీ… పంట పెట్టుబడి సాయం అందించకపోవటంపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం వైపు నుంచి పలు కీలక బిల్లలను సభ ముందుకు తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. 6 గ్యారెంటీల అమలు,నిరుద్యోగుల ఆందోళన, లా అండ్ ఆర్డర్ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే అవకాశం ఉండగా… అదే స్థాయిలో సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కూడా సిద్ధమవుతున్నారు.