AP Assembly Speaker : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు - ఏకగ్రీవంగా ఎన్నిక-ayyanna patrudu is unanimously elected speaker of ap assembly ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly Speaker : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు - ఏకగ్రీవంగా ఎన్నిక

AP Assembly Speaker : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు - ఏకగ్రీవంగా ఎన్నిక

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 21, 2024 06:59 PM IST

AP Assembly Speaker Ayyanna Patrudu : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక్క నామినేషన్ మాత్రమే రావటంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది.

ఏపీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు
ఏపీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు

AP Assembly Speaker Ayyanna Patrudu :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం ఒకే ఒక నామినేషన్‌ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. రేపు ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు.

సీనియర్ నేతగా అయ్యన్నపాత్రుడు….

చింతకాయల అయ్యన్నపాత్రుడు...టీడీపీ సీనియర్ నేత. ఎన్టీఆర్ కేబినెట్ లోనూ మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 24,676 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాజా విజయంతో కలిసి ఇప్పటికి ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 

అయ్యన్నపాత్రుడు 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1996లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. అయ్యన్న...ఎన్టీఆర్‌, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా చంద్రబాబు కేబినెట్ స్థానం దక్కుతుందని భావించిన... యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో మంత్రి పదవి దక్కలేదు. అయితే గతంలో ఇచ్చిన హామీ మేరకు అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవిని చంద్రబాబు ఖరారు చేశారు. దీంతో ఆయన నామినేషన్ వేయగా.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మరోవైపు ఇవాళే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించారు.  శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఇవాళ మొత్తం 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఇతర కారణాలతో సభకు రాని ముగ్గురు ఎమ్మెల్యేలు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

శనివారం జరిగే సభలో అయ్యన్నపాత్రుడు స్పీకర్ పీఠంపై కూర్చోనున్నారు. ప్రొటెం స్పీకర్ నుంచి బాధ్యతలను స్వీకరిస్తారు.గత ప్రభుత్వంలో కూడా ఉత్తరాంధ్రకే చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్ గా వ్యవహరించారు. ఈసారి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అయ్యన్నపాత్రుడికే స్పీకర్ ఛైర్ దక్కింది.

డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి…?

మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిపై జనసేన ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లేదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్లను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరే కాకుండా…టీడీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన మండలి బుద్ధా ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ పదవిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

 

WhatsApp channel