CM Chandrababu : వారివి ఫేక్ పాలిటిక్స్.. జగన్ బెదిరింపులకు భయపడేది లేదు - సీఎం చంద్రబాబు కామెంట్స్
CM Chandrababu ON YS Jagan : శాంతి భద్రతలపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ ది ఫేక్ రాజకీయమన్న ఆయన... వ్యక్తిగత దాడులకు రాజకీయ రంగు పులుముతున్నారని దుయ్యబట్టారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు.

CM Chandrababu ON YS Jagan : నేరస్తులు రాజకీయ ముసుగులో తప్పులు చేసి తప్పించుకుంటాం అంటే కుదరదన్నారు సీఎం చంద్రబాబు. వ్యవస్థల నిర్వీర్యంతో వారసత్వంగా నేర సంస్కృతి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఉనికి చాటుకోవడానికి జగన్ హింసా రాజకీయాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పు చేస్తే తప్పించుకోలేం అనే భయం కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన.... ప్రజలు కూటమి ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారని... తిరుగులేని మెజారిటీలతో గెలిపించారని గుర్తు చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని... అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలని దిశానిర్దేశం చేశారు.
నిధులు రాబట్టండి - ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి, పోలవరం, జల్ జీవన్ మిషన్ వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు జరిగేలా చూడాలన్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 లో ఉన్న ఆస్తుల పంపకాన్ని పూర్తి చేయాలని... ఇప్పటికే దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టామని చెప్పుకొచ్చారు. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులు అన్నీ 2014 నుంచి 2019 వరకు వేగంగా పూర్తి అయ్యాయని... కానీ జగన్ అన్నింటినీ రివర్స్ చేశారని ఆరోపించారు.
"2029లో కూడా పార్టీ గెలవడానికి మనం నేటి నుంచే అడుగులు వేయాలి. ప్రజలకు అవసరం అయిన మంచి పనులు చేసుకుంటూ పోవాలి. ప్రజలకు మంచి చేసే విషయంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలి. వారంలో ప్రతి మంత్రి, ఎంపీ ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలి. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. నేను అందుకే 1995 పాలన అని మళ్లీ చెపుతున్నాను. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉండాలి. దాన్ని 1995లో అమలు చేశాం. మళ్లీ ఆ విధానం అమల్లో ఉండాలి" అని చంద్రబాబు కామెంట్స్ చేశారు.
లక్షల ఎకరాల భూమిని కొట్టేశారు….
విభజన కష్టాలు అధికమించి మనం ముందుకు పోతున్న సమయంలో 2019లో జగన్ వచ్చి రాష్ట్రాన్ని 20 నుంచి 30 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లాడని చంద్రబాబు ఆరోపించారు. అప్పుల కోసం కార్పొరేషన్లు పెట్టాడని దుయ్యబట్టారు. పిఎఫ్ వంటి ఉద్యోగుల సొమ్మునూ ఇతర విభాగాలకు తరలించారని.... వాళ్లు దాచుకున్న సొమ్మును లాగేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 1.75 లక్షల ఎకరాల భూమిని కొట్టేశారన్న చంద్రబాబు.... 5 ఏళ్లలో రూ.40 వేల కోట్ల విలువైన భూములు మింగేశారని అన్నారు.
జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదు - చంద్రబాబు
"ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించిన తరువాత కూడా జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఉనికి చాటుకోవడానికి జగన్ హింసా రాజకీయాలు అని మనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఫేక్ పాలిటిక్స్ నే నమ్ముకున్నాడు. జగన్ బెదిరింపులకు భయపడేది లేదు..కుట్రలను సాగనిచ్చేది లేదు. తప్పుడు ప్రచారంతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. వినుకొండ హత్య అత్యంత కిరాతకం. నిందితులను వదిలేది లేదు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు కూడా జగన్ రాజకీయ రంగు వేస్తున్నాడు. గత 5 ఏళ్లు వ్యవస్థలు అన్నీ ధ్వంసం అయ్యాయి. అదుపులేని గంజాయి, మద్యం, డ్రగ్స్ వల్లే రాష్ట్రంలో క్రైం రేటు పెరిగింది. దీన్ని త్వరలో పూర్తిగా కంట్రోల్ చేస్తాం. టీడీపీ అంటేనే బెస్ట్ లా అండ్ అర్డర్ అని అంతా భావిస్తారు. ఈ బ్రాండ్ ను దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా సహించేది లేదు" అని చంద్రబాబు స్పష్టం చేశారు.