Bapatla : బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి ప్రేమోన్మాది వీరంగం.. బాలిక కుటుంబపై కత్తితో దాడి
08 October 2024, 10:41 IST
- Bapatla : బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించలేనని అన్నందుకు ఓ బాలికపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ఆ బాలిక కుటుంబంపైనా దాడికి తెగబడ్డాడు. అర్ధరాత్రి సమయంలో కత్తి.. సుత్తితో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక తండ్రి
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని ఓ గ్రామంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక గతంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ఆ సమయంలో అదే మండలంలోని రాజోలు పంచాయతీ పరిధి రెడ్లపాలేనికి చెందిన కుంచాల భార్గవ్ రెడ్డి.. తనను ప్రేమించాలంటూ ఆమె వెంటపడ్డాడు. ప్రేమపేరుతో వేధింపులకు గురిచేసేవాడు.
ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు చదువు మాన్పించి.. బాలికను ఇంటి వద్దే ఉంచారు. అటు తన కుమార్తెకు పెళ్లి చేయాలని బాలిక తండ్రి కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన భార్గవ్ రెడ్డి.. తనకు దక్కని బాలిక.. వేరెవ్వరికీ దక్కకూడదని భావించాడు. ఆదివారం అర్థరాత్రి భార్గవ్ రెడ్డి తన స్నేహితుడు విజయభాస్కర్ రెడ్డితో కలిసి ఆ బాలిక ఇంటికి వెళ్లాడు.
వారు వచ్చిన చప్పుడు విని నిద్ర లేచిన బాలిక తల్లిదండ్రులు.. ఎవరిని ప్రశ్నించారు. అంతలోనే వెంట తెచ్చుకున్న కత్తి, సుత్తితో బాలిక తల్లిదండ్రులపై భార్గవ్ రెడ్డి దాడి చేశాడు. బాలిక తండ్రి ఛాతీ, వీపుపై కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన అతడి భార్య, కుమార్తెపై కూడా దాడి చేశాడు. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరి అరుపులు, కేకలు విని ఇరుగుపొరుగు వారు నిద్ర లేచి పరుగెత్తుకొచ్చారు. వారి రాకను గమనించిన నిందితుడు.. స్నేహితుడితో కలిసి పరారయ్యాడు.
తీవ్ర గాయాలు పాలైన ఆ కుటుంబ సభ్యులను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అనిల్‌కుమార్ చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామని అన్నారు. అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశామని ఎవరూ స్పందించలేదని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. నేరుగా ఎస్ఐ సెల్‌కు ఫోన్ చేశామని, ఆయన కూడా స్పందించలేదని అంటున్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ.. సోమవారం సాయంత్రం గ్రామస్థులు జాతీయ రహదారిపై బైఠాయించారు. రాస్తారోకో చేపట్టి, వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తహసీల్దార్ పద్మావతి, రేపల్లె రూరల్ సీఐ సురేష్ బాబు అక్కడికి చేరుకుని చర్చించారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసి తగిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబాన్ని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా సంఘం (ఐద్వా), ఎస్ఎఫ్ఐ, సీపీఎం నేతలు పరామర్శించారు. నిందితులను వెంటనే శిక్షించాలని ఆసుపత్రి వద్ద నాయకులు ధర్నా చేపట్టారు. నిందితుడిని 24 గంటలల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డీఎస్పీని కోరారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)