Jani Master Remand : ముగిసిన జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ, చంచల్ గూడా జైలుకు తరలింపు-rangareddy court remand to jani master october 3rd in pocso case police custody ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jani Master Remand : ముగిసిన జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ, చంచల్ గూడా జైలుకు తరలింపు

Jani Master Remand : ముగిసిన జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ, చంచల్ గూడా జైలుకు తరలింపు

Bandaru Satyaprasad HT Telugu
Sep 28, 2024 04:43 PM IST

Jani Master Remand : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 3వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇవాళ్టితో జానీ మాస్టర్ నాలుగు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో అతనిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

ముగిసిన జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ, చంచల్ గూడా జైలుకు తరలింపు
ముగిసిన జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ, చంచల్ గూడా జైలుకు తరలింపు

Jani Master Remand : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ శనివారం ముగిసింది. అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది. నాలుగు రోజుల పాటు జానీ మాస్టర్ ను పోలీసులు విచారించారు. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో....అతనిని ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. కోర్టు విచారణ అనంతరం అతనిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ కు పోక్సో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

పోలీసుల కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి

పోలీసుల కస్టడీలో జానీ మాస్టర్ కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. పోలీసుల విచారణలో జానీ మాస్టర్‌ కాస్త అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో జానీ మాస్టర్‌ ఏకీభవించలేదని సమాచారం. ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఒక టీవీ షోలో తనకు తానే వచ్చి పరిచయం చేసుకుందని జానీ మాస్టర్ పేర్కొన్నారు. ఆమె మైనర్‌గా ఉన్నప్పుడు లైంగిక దాడి చేశాననేది అబద్ధమన్నారు. ఆమె టాలెంట్‌ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చానన్నారు.

తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలే తనను మానసికంగా హింసించిందని జానీ మాస్టర్‌ పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో తనను ఎన్నోసార్లు ఆమె బెదిరించినట్లు చెప్పారు. ఈ సమస్యను ఓ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని ఆయన బాధితురాలితో మాట్లాడారన్నారు. అప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. తనపై కుట్ర చేస్తున్నారు, ఆమె వెనుక ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారని జానీ మాస్టర్ ఆరోపించారు. తన ఎదుగుదలను ఓర్వలేక లైంగిక వేధింపుల కేసులో ఇరికించారని జానీ మాస్టర్‌ పోలీసుల కస్టడీలో చెప్పారు.

జానీ మాస్టర్ భార్య ఫిర్యాదు

జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధితురాలిపై.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం.. తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని ఫిర్యాదులో ఆరోపించారు. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో చూపించిందని.. తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని ఆరోపించారు.

సంబంధిత కథనం