Bandi Sanjay: పిడికెడు మందికి భయపడేది జాతీయ పార్టీ అవుతుందా? ఒవైసీకి భయపడ్డారని ఎద్దేవా చేసిన బండి సంజయ్-will it be a national party that is feared by a handful of people bandi sanjay comments on owaisi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: పిడికెడు మందికి భయపడేది జాతీయ పార్టీ అవుతుందా? ఒవైసీకి భయపడ్డారని ఎద్దేవా చేసిన బండి సంజయ్

Bandi Sanjay: పిడికెడు మందికి భయపడేది జాతీయ పార్టీ అవుతుందా? ఒవైసీకి భయపడ్డారని ఎద్దేవా చేసిన బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Sep 19, 2024 07:22 AM IST

Bandi Sanjay: మా వల్లే తెలంగాణ వచ్చింది... మేం బిల్లు పెడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది...అని చెప్పుకుంటున్న పార్టీలు తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలను విస్మరిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు.

ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి  బండి సంజయ్ కుమార్
ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

Bandi Sanjay: దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే...ఆ సమయంలో తెలంగాణకు స్వాతంత్ర్యం ఎందుకు రాలేదు?.. దానికి కారకులెవరు?... తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చింది?.. అనే విషయాలను నేటి తరానికి పూర్తిగా తెలియజేయలేకపోవడం విడ్డూరమన్నారు.

రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎంకు భయపడి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. ‘‘పిడెకెడు మంది ఉన్న దరిద్రపు పార్టీ ఎంఐఎం... ఆ పార్టీకి భయపడేది జాతీయ పార్టీ అవుతుందా?.. ఉద్యమ పార్టీ అవుతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో కరీంనగర్ లోని టీఎన్జీవోస్ భవనలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే ‘ఫొటో ఎగ్జిబిషన్’ను కేంద్ర మంత్రి సంజయ్ ప్రారంభించారు.

నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను ప్రజలకు గుర్తు చేయడమే ఈ ఫొటో ఎగ్జిబిషన్ లక్ష్యమని తెలిపారు. కొమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ, బూర్గుల రామక్రిష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ తదితరుల పోరాటాల చరిత్రను స్మరించుకునే అవకాశం ఈ ఎగ్జిబిషన్ ద్వారా కలుగుతోందని చెప్పారు.

బైరాన్ పల్లి సంఘటన, రజాకార్ల ఆకృత్యాలతోపాటు సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో నిర్వహించి హైదరాబాద్ సంస్థానికి విముక్తి కలిగించిన ప్రధాన సంఘటనలతో ఈ ఎగ్జిబిషన్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూసే అవకాశం లభించిందన్నారు. గతం ఎట్లుందో తెలుసుకోవడమంటే భవిష్యత్తుకు దారిని నిర్మించుకోవడమేనని, గతాన్ని మర్చిపోయిన జాతి ఎన్నడూ సవ్యంగా ముందుకు పోదన్నారు.

నెహ్రూ విధానాలు అవలంబిస్తే దేశం పదిముక్కలయ్యేది…

సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ చేసిన సాహసాన్ని, పోరాటా యోధులను స్మరించుకున్న బండి సంజయ్, జవహర్ లాల్ నెహ్రూ విధానాలను దేశంలో ఇంకా అవలంబించి ఉంటే భారత దేశం 10 ముక్కలయ్యేదన్నారు. సర్దార్ పటేల్ దేశంలోని 562 సంస్థానాలను విలీనం చేసిన దేశభక్తుడని కొనియాడారు.

పటేల్ ముమ్మాటికీ తమకు అరాధ్యుడేనని, బీజేపీ అధికారలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఏటా ‘తెలంగాణ విమోచన దినోత్సవాల’ పేరుతోనే అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ లో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ విమోచన చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అరుదైన చిత్రాలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటున్నందున నగర ప్రజలు వీక్షించాలనీ కోరారు.

తెలంగాణలో తొలి ఏఆర్ వీఆర్ ల్యాబ్ కరీంనగర్ లో ప్రారంభం

కరీంనగర్ ఐటీఐ కళాశాలలో తొలిసారిగా అగ్ మెంటెడ్ రియాలిటీ, వీడియో వర్చువల్ రియాలిటీ పద్దతిలో వివిధ కోర్సులకు సంబంధించి బోధన ప్రారంభమైంది. నేషనల్ ఇన్ స్ట్రక్షనల్ మీడియా ఇన్స్టిట్యూట్(నిమి) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అసోం, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ తోపాటు ఏపీలోని వైజాగ్ రాష్ట్రాల్లో మాత్రమే ‘AR VR ల్యాబ్’ ద్వారా ఐటీఐ కాలేజీల్లో కోర్సులను ప్రాక్టీస్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు.

తెలంగాణలోని తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టు కింద కరీంనగర్ ఐటీఐ కాలేజీలో ఏర్పాటు చేసిన ఏఆర్, వీఆర్ ల్యాబ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఐటీఐ విద్యార్థి ఏ ట్రేడ్లోనైతే చేరతాడో... ఆ కోర్సును AR VR ల్యాబ్ ద్వారా లైవ్ లో నేర్చుకోవచ్చని తెలిపారు. ఎలక్ట్రిషియన్, వైర్ మేన్ ట్రేడ్, వెల్డర్, ఫిట్డర్, మెకానికల్ ట్రేడ్, టర్నర్ ట్రేడ్ ఇలా పలు రకాల కోర్సులను AR VR ల్యాబ్ లో ప్రాక్టీస్ చేయవచ్చని తెలిపారు.

కరీంనగర్ ఐటీఐలో చదువుకున్నానని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరాలని, అదే సమయంలో ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్ధికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పించాలన్నదే తన లక్ష్యమన్నారు. ఐటీఐ కాలేజీలో వాష్ రూంకు ఇబ్బంది ఉందని, కిటికీలు దెబ్బతిన్నాయని విద్యార్ధులు సంజయ్ ద్రుష్టికి తీసుకురావడంతో వాటితోపాటు కాలేజీలో కనీస సౌకర్యాలన్నీ కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినోత్సవం నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘‘సేవా పక్వాఖా’’ పక్షోత్సవాల్లో భాగంగా మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ లాడ్స్ ద్వారా ఏఆర్, వీఆర్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు

ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలకు నిధులిస్తారా?

జమ్మికుంటలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన హాస్టల్ బ్లాక్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం శోచనీయమన్నారు. చీపురపుల్లతో సైతం ఏకే 47లు తయారు చేసేంతటి శిక్షణనిస్తూ ఉగ్రవాదాన్ని పోషిస్తూ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన మదర్సాలకు ప్రభుత్వాలు నిధులివ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు