Bus Accident : అల్లూరి జిల్లాలో ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 16 మందికి గాయాలు
09 September 2024, 10:20 IST
- Bus Accident : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు వాగులోకి దూసుకెళ్లింది. వాగు - రోడ్డు మధ్య బస్సు వేలాడుతుంది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ సహా 16 మందికి గాయాలు అయ్యాయి. స్థానికులు ప్రయాణికులను కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం గ్రామ శివారులో ప్రమాదం జరిగింది. ఆదివారం రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్తున్న రాజమండ్రి డిపోకు చెందిన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు.. అదుపు తప్పి ఐరన్ బ్రిడ్జిని ఢీకొంది. పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. దీంతో రోడ్డుకు వాగుకు మధ్య బస్సు వేలాడింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ సహా 16 మందికి గాయాలు అయ్యాయి.
ప్రమాదం సమయంలో.. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం గ్రామ శివారుకు వచ్చేసరికి బస్సు అదుపు తప్పిందని.. అందుకే వాగులోకి దూసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. బస్సు వాగుకు, రోడ్డుకు మధ్య వేలాడుతోందని.. ప్రయాణికులు తమను రక్షించాలంటూ కేకలు వేశారు. ఆ కేకలు విని స్థానికులు, వాహనదారులు అక్కడి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు.
పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. రాజవొమ్మంగి సీఐ ఎన్.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జడ్డంగి పీహెచ్‌సీలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలేశ్వరం, రాజమండి, నర్సీపట్నం ఆసుపత్రిలకు తరలించారు.
క్షతగాత్రుల్లో కనిగిరి గ్రామానికి చెందిన బి.మంగతాయరు, బిడదనాంపల్లి గ్రామానికి చెందిన పీ.రవి, జొన్నాడ గ్రామానికి చెందిన జీ.కుమారి, కృష్ణదేవి పేట గ్రామానికి చెందిన పీ.వరలక్ష్మీ, ఎస్‌టీ రాజాపురం గ్రామానికి చెందిన కే.మంగలను మెరుగైన వైద్యం కోసం కాకినాడ జిల్లా ఏలేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆసుపత్రులకు తరలించారు. స్వల్ప గాయాలు అయిన వారికి జడ్డంగి పీహెచ్‌సీలో ప్రాథమిక వైద్యం అందించి స్వస్థలాలకు పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధి)