కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు స్పాట్‌డెడ్
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లి, కొడుకు, కోడలు ఉన్నారు. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆదివారం రాత్రి కర్నూలు జిల్లా ఆలూరు మండలం హులేబీడు గ్రామ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదోని పట్టణం ఫరిస్సా మొహల్లా వీధిలో నివాసం ఉండే ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో బంధువుల శుభకార్యానికి మహీంద్రా జైలో కారులో వెళ్లారు. సాయంత్రం తిరిగి బళ్లారి నుంచి అదే కారులో ఆదోనికి వెళ్తున్నారు.
కారు ఆలూరు మండలంలోని హులేబీడు గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆ ప్రదేశంలో మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ప్రమాదంలో సాబెరా (60), మేస్త్రీ గౌస్ (45), నస్రీన్ (32) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న సీమ, అహ్మద్ రజా, డ్రైవర్ ఖాదర్, షబానా బేగం తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు చిన్నారులు స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం రెండు 108 అంబులెన్సుల్లో ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం తెలుసుకున్న ఆలూరు సీఐ శ్రీనివాస నాయక్, ఎస్ఐ నరసింహులు పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సాబెరా, మేస్త్రీ గౌస్, నస్రీన్ మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస నాయక్ తెలిపారు. కారు టైర్ పంక్చర్ కావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.
రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు, కోడలు మృతి చెందిన విషయం తెలిసి, మృతుల కుటుంబ సభ్యులకు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని స్థానికులను కలచివేసింది.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు