Sangareddy News : ఈ తాపీ మేస్త్రీ మాములోడు కాదు..! 30 చోరీ కేసుల్లో నిందితుడు, పోలీసులకు ఇలా దొరికిపోయాడు..!-kondapur police arrested a person who was involved in theft in sangareddy distric ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy News : ఈ తాపీ మేస్త్రీ మాములోడు కాదు..! 30 చోరీ కేసుల్లో నిందితుడు, పోలీసులకు ఇలా దొరికిపోయాడు..!

Sangareddy News : ఈ తాపీ మేస్త్రీ మాములోడు కాదు..! 30 చోరీ కేసుల్లో నిందితుడు, పోలీసులకు ఇలా దొరికిపోయాడు..!

HT Telugu Desk HT Telugu
Sep 06, 2024 04:44 PM IST

తాపీ మేస్త్రీ పని చేస్తూ రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 30 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. చోరీల వివరాలను కొండాపూర్ సీఐ చంద్రయ్య వెల్లడించారు.

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

పగలు తాపీ మేస్త్రిగా పని చేస్తూ రాత్రి తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు కొండాపూర్ సీఐ తెలిపారు. 

సీఐ చంద్రయ్య వెల్లడించిన వివరాల ప్రకారం… సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన సన్నిధి ఆంజనేయులు తాపీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మద్యానికి అలవాటై జల్సాలకు బానిసయ్యాడు.  రాత్రి వేళల్లో ఇళ్లలో చోరీలు, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

తాళాలు పగలగొట్టి .......!

ఆంజనేయులు పగలు తాళం వేసిన ఇళ్లను రెక్కీ నిర్వహిస్తాడు. రాత్రి సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక్కడే ఇంటి తాళాలను ఇనుప రాడ్ సహాయం తో విరగగొట్టి ఇంటిలోకి దూరుతాడు. నగదు మరియు విలువైన బంగారు, వెండి ఆభరణాలు దోచుకుని పోతాడు. అలాగే రాత్రి సమయలో ఇంటి బయట పార్క్ చేసిన బైక్ లను కూడా చోరీ చేస్తున్నాడు.  అలా దొంగతనం చేసిన వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు.

30 కేసుల్లో నిందితుడు!

గురువారం మల్కాపూర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా బైక్ పై వెళుతున్న ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకొని.. తమదైన శైలిలో విచారించారు. ఆ విచారణలో ఆంజనేయులు చేసిన దొంగతనాలు ఒప్పుకున్నాడు. ఇప్పటివరకు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోరీకి పాల్పడి 30 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే వికారాబాద్ లో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపి మే 10న విడుదల అయినా అతనిలో మార్పు రాలేదు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో 39 తులాల బంగారం, 189 తులాల వెండి, 2 బైక్ లతో పాటు రూ. 9. 50 లక్షల నగదు అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం 15. 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీసీఎస్ ఎస్సై తో పాటు 18 మంది సిబ్బందికి సీఐ రివార్డ్ లను అందజేశారు.

మెదక్ లో మరో ఘటన :

మరోవైపు బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగ్ లో నుండి బంగారం చోరీకి గురైన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ లో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డి గూడెంనికి చెందిన మహిళ గురువారం శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామానికి తన తల్లిగారింటికి వచ్చింది. 

అనంతరం వదిన వద్ద ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలను బ్యాగ్ లో పెట్టుకొని తిరిగి స్వగ్రామానికి బయల్దేరింది. ఈ క్రమంలో రామాయంపేట నుండి సికింద్రాబాద్ వెళ్లే బస్సులో ఎక్కింది. కొద్దీ దూరం ప్రయాణించాక బ్యాగ్ లో చూస్తే బంగారం కనిపించలేదు. దీంతో ఎవరో బంగారం చోరీ చేసారని గుర్తించి వెంటనే తూప్రాన్ పోలీసులకు పిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.