Rajahmundry Leopard Movement : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో చిరుత కలకలం రేపింది. రాజమండ్రి లాలాచెరువులో చిరుతపులి కనిపించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కేంద్రం వద్ద సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చిరుత కనిపించింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలించిన రేడియో స్టేషన్ సిబ్బందికి చిరుత పులి కనిపించింది. పంది వెనుక చిరుత వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో రేడియో స్టేషన్ సిబ్బంది వెంటనే చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
చిరుతపులి సంచారానికి సంబంధించిన దృశ్యాలను అటవీ అధికారులకు అందజేశారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు చిరుతను గుర్తించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత సంచారంపై నిఘాపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుతను త్వరితగతిన పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.
"రాజానగరం-రాజమండ్రి ఫారెస్ట్ ఏరియాలో చిరుతపులి సంచరిస్తుందని సమాచారం వచ్చింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా ఎవరు సంచరించకండి. సాధ్యమైనంత వరకు గుంపులుగానే వెళ్లండి. ఫారెస్ట్ అధికారులు చిరుతను బంధించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.కాబట్టి ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. రాజమండ్రి నుంచి అటవీ మార్గంలో శ్రీరాంపురం వెళ్లేవారు, జాతీయ రహదారి మార్గంలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలి."- ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
రాజానగరం మండలంలోని లాలాచెరువు సమీపంలోని గోదావరి మహాపుష్కరవనం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో చిరుత సంచరించి ఒక జంతువును నోట కరుచుకొని వెళ్లిందనే స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రదేశంలో అనుమానాస్పదంగా ఉన్న పాదముద్రలను కనిపించాయి. అవి ఏ జంతువుకు సంబంధించినవో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గోదావరి పుష్కరవనంలో జంతువుల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడే జంతువులను బంధించేందుకు ఒక బోను కూడా ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ సెక్షన్ డీఆర్ఐ పద్మావతి పేర్కొన్నారు.
సంబంధిత కథనం