ములుగు జిల్లాలో చిరుత కలకలం.. మదనపల్లి ఫారెస్ట్‌లో ఆనవాళ్లు
ములుగు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని మదనపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్టు గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పెద్దగా అటవీ ప్రాంతం లేని చోట చిరుత పులి ఆనవాళ్లు కనిపిస్తుండటంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ములుగు జిల్లా ములుగు మండలం మదనపల్లి శివారులోని అటవీ ప్రాంతంలోని సమీపంలో ఉన్న పంట పొలాల్లో చిరుత పులి అడుగులను కొందరు స్థానికులు గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అక్కడున్న చిరుత అడుగులను గుర్తించి వాటి కొలతలు తీసుకున్నారు.
పాకాల అటవీ ప్రాంతం నుంచి ఇక్కడికి..?
చిరుత అడుగు జాడలను పరిశీలించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శంకర్.. ఆ పులి మహబూబాబాద్ జిల్లా పాకాల అడవి ప్రాంతం నుంచి ములుగు వైపునకు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అడుగుల కొలతలను బట్టి సుమారు మూడేళ్ల వయసున్న మగ చిరుత పులిగా భావిస్తున్నారు. మదనపల్లి శివారులో సంచరించిన పులి ఇక్కడి నుంచి జాకారం ప్రేమ్ నగర్ అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు అడుగుల జాడను బట్టి అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. చిరుత సంచరిస్తున్నందున పశువుల కాపరులతో పాటు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
భయాందోళనలో సమీప గ్రామాలు
మదనపల్లి శివారులో అంతంత మాత్రమే అటవీ ప్రాంతం ఉండటం, అక్కడే చిరుత పులి అడుగుల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తం అవుతోంది. దీంతో ప్రేమ్ నగర్, మదనపల్లి, జాకారం, మాన్ సింగ్ తండా ప్రజలు తమ గ్రామ సమీప అడవుల్లోకి వెళ్ళొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పశువుల కాపర్లు పొలాల వద్దకు వెళ్లే కూలీలకు పాదముద్రలు, చిరుత ఆనవాళ్లు కనిపిస్తే ఫారెస్ట్ అధికారులకు 98493 58923, 94408 10881 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
పులిని గుర్తించేందుకు కెమెరాలు
సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ములుగు మండలం గట్టమ్మ ఆలయ సమీపంలో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తికి చిరుత కనిపించినట్లు ప్రచారం జరిగింది. మంగళవారం ఉదయం కూడా ఇలాగే బైక్ పై వెళ్తున్న వ్యక్తికి కనిపించినట్టు తెల్సింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పులిని గుర్తించడం కోసం ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. పులి సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
-రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి