YS Sharmila On KCR: 3 అప్పులు, 6 కమీషన్లు.. కేసీఆర్ పై షర్మిల సెటైర్లు
ys sharmila slams cm kcr: సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. పలు రకాల స్కీమ్ ల పేరుతో మరోసారి మోసం చేసే ప్రయత్ననం చేస్తున్నారని... వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.
YS Sharmila Satires On CM KCR: ఎన్నికల దగ్గరపడుతున్న వేళ సీఎం కేసీఆర్ అనేక రకాల పథకాల పేర్లు చెబుతున్నారని విమర్శించారు వైఎస్ షర్మిల. దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి అనుచరుల బంధు పథకంగా మార్చారని.. త్వరలోనే గిరిజన బంధు, బీసీ బంధు అని చెప్పి మోసం చేసేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. ములుగులో సాగుతున్న ప్రజాప్రస్థాన పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన ఆమె... టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచి మాటలు చెప్పి కేసీఆర్ మోసం చేస్తారని షర్మిల మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ ను గెలిపిస్తే రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని.. కేసీఆర్ మోసాలను ప్రజలకు తెలియజేసేందుకే తాను పాదయాత్ర చేస్తున్నాని చెప్పారు. ఇప్పటికే 3 వేల కి.మీకు పైగా పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తనని ఆదరించాలని... రాజన్న రాజ్యమే లక్ష్యంగా ముందుకుసాగుతానని స్పష్టం చేశారు.
తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని గప్పాలు కొట్టిన కేసీఆర్...,అంకెల గారడీతో, అరచేతిలో వైకుంఠం చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. కేసీఆర్ రూ.2.5లక్షల కోట్ల బడ్జెట్, 4నెలలు మిగిలి ఉండగానే రూ.40వేల కోట్ల లోటుతో చేతులెత్తేసిందని సెటైర్లు విసిరారు. అంచనాలు తప్పటంతో కేంద్రం మీద నెపం మోపి... తప్పించుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. 3 అప్పులు, ఆరు కమీషన్లతో కేసీఆర్ వర్థిల్లుతున్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పాదయాత్రకు భారీ ఎత్తున తరలివచ్చిన ఆదివాసీ, గిరిజన బిడ్డలకు షర్మిల కృతజ్ఞతలు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అర్హులైన రైతులందరికీ పోడు పట్టాలు ఇవ్వడమే కాకుండా యువతకు, మహిళలకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు.