Gadwal District: అధికారి కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ MLA
TRS MLA KrishnaMohan Reddy: గద్వాల జిల్లాలో ప్రోటోకాల్ రగడ చర్చనీయాంశంగా మారింది. ఏకంగా స్థానిక ఎమ్మెల్యే... జిల్లాస్థాయి అధికారి కాలర్ పట్టుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు.
trs mla krishna mohan reddy holding officer collar: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓ అధికారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను రాకుండా ఓ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగడంపై తీవ్రస్థాయిలో పరుషపదజాలం ప్రయోగించారు. అంతేకాదు... ఏకంగా అధికార కాలర్ పట్టుకుని పక్కకు నెట్టేశారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. తాను రాకముందే బీసీ గురుకుల పాఠశాలను ఎలా ప్రారంభిస్తారని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
ఏం జరిగిందంటే...
గద్వాలలో మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సరితను అధికారులు ఆహ్వానించారు. నిర్దేశిత సమయానికి వచ్చిన జెడ్పీ చైర్‌పర్సన్ ఆ గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకొని కోపంతో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే అధికారులపై చిందులు తొక్కారు. ప్రొటోకాల్ ప్రకారం గురుకుల పాఠశాలలకు తాను చైర్మన్‌కాగా, జెడ్పీ చైర్‌పర్సన్‌తో దానిని ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ వెంగళ్‌రెడ్డి సర్దిచెప్పబోగా ఒక్కసారిగా కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే ఆయన చొక్కా కాలర్ పట్టుకుని బలంగా వెనక్కి నెట్టేశారు. బూతులు తిడుతూ ఊగిపోయారు. అక్కడే ఉన్న పార్టీ నాయకులు అధికారిని పక్కకు తీసుకుపోయారు. ప్రజాప్రతినిధి దాదాగిరికి పాల్పడటంపట్ల అధికార, ఉద్యోగవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గద్వాల ఎమ్మేల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో అంతర్గత వైరం సాగుతోంది. జడ్పీ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా ప్రారంభమైన వైరం, జడ్పీ సీఈఓల బదిలీలతో తారాస్థాయికి చేరింది. ఇందులో జడ్పీ చైర్ పర్సన్ సరితకు మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు ఉండటంతో, ఆమె గద్వాల ఎమ్మెల్యేతో సై అంటే సై అన్నట్టు దూసుకుపోతున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో జెడ్పీ సీఈవో నియామకం విషయంలో కూడా వర్గపోరు తెరపైకి వచ్చింది. ఓదశలో ఎమ్మెల్యే కృష్ణామోహన్ రెడ్డి తన గన్ మెన్లను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఓ అధికారి గల్లా పట్టుకొని బూతులు తిట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.
టాపిక్