TRS Left Parties Alliance: ఆ సీటు కోసం MLC ఆఫర్… కామ్రేడ్లు ఒకే అంటారా...?
TRS - CPI CPM Alliances: కారుతో కామ్రేడ్లు కలిశారు... మునుగోడులో విక్టరీ కొట్టారు. తమ దోస్తీ జాతీయ స్థాయిలోనూ ఉంటుందని కేసీఆర్ తో పాటు ఇరు పార్టీల నేతలు కూడా చెప్పుకొచ్చారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో... తెలంగాణలోని పలు స్థానాలపై కన్నేశారు కమ్యూనిస్టులు. అయితే ఓ సీటు విషయంలో తెగ చర్చ నడుస్తోందట..! అయితే దీనిపై గులాబీ బాస్... మరో ప్రతిపాదనను కామ్రేడ్ల ముందు పెట్టారంట..!
TRS and CP CPM Alliance in Telangana: మునుగోడు అసెంబ్లీ(Munugode Assembly) ఉపఎన్ని కల్లో టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చాయి సీపీఐ, సీపీఎం. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే వెళ్లాలని ఆలోచనలో ఉన్నాయి. కేసీఆర్ సైతం.. ఈ పొత్తు ఇప్పటికీ మాత్రమే కాదు.. భవిష్యత్ లోనూ అని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడానికి కమ్యూనిస్టులు కీలకంగా మారారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ కూడా ఓ రకంగా ఒప్పుకుంటోంది. 2018 తర్వాత... పూర్తిగా దెబ్బతిన్న కమ్యూనిస్టు పార్టీలు... వచ్చే ఎన్నికల్లో కొన్నిస్థానాలను గెలిచి... మళ్లీ లైన్ లోకి రావాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ తో పొత్తుతో కలిసివచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారట..! ఈ క్రమంలోనే పలు జిల్లాలోని సీట్లపై కన్నేశారనే వార్తలు బయటికి వస్తున్నాయి. అయితే ఓ సీటు తమకే కేటాయించాలని సీపీఐ... సీరియస్ గా అడుగుతుందట..! అయితే ఈ సీటుపై కూడా టీఆర్ఎస్ అంతే ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్...సీపీఐ ముందు మరో ప్రతిపాదన పెట్టారనే టాక్ వినిపిస్తోంది.
ఎమ్మెల్సీ ఆఫర్...!
కామ్రేడ్లతో టీఆర్ఎస్ పొత్తు ఒకే అయితే...పలుచోట్ల పోటీ ఆసక్తికరంగా మారే ఛాన్స్ స్పష్టంగా ఉంటుంది. అయితే కామ్రేడ్లు అడుగుతున్న సీట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా హుస్నాబాద్ సీటును తమకే కేటాయించాలని సీపీఐ గట్టిగా కోరుతోందట. ఎందుకంటే.. అది సీపీఐ సీనియర్ చాడ వెంకట రెడ్డి నియోజకవర్గం. గతంలో ఇదే స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా(2004లో) కూడా గెలిచారు. ఫలితంగా ఈ సీటుపై గట్టి ఆశలు పెట్టుకుంది. ఇదే సమయంలో ఈ సీటుపై అంతే ఆశలు పెట్టుకుంది గులాబీ దళం. ఇక్కడ కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుమారుడు సతీశ్ కుమార్... ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2018లోనూ గెలిచారు. దీంతో మరోసారి ఇక్కడ్నుంచే పోటీ చేసి గెలవాలని ఆయన భావిస్తున్నారు. పార్టీ నాయకత్వం కూడా... ఈసీటును ఈజీగా గెలవొచ్చని లెక్కలు వేస్తొందట.. ! ఈ క్రమంలోనే గులాబీ బాస్ కేసీఆర్... సీపీఐకి ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చాడ వెంకటరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే... ఈ సీటును తమకే వదలిపెడతారని గులాబీ దళపతి భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
రాష్ట్రంలో వచ్చే ఏడాది 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో మూడు స్థానాలు మే 29న ఖాళీ అవుతాయి. వీటిలో ఒక స్థానాన్నిసీపీఐకి కేటాయించే అవకాశమున్నట్లు లీక్ లు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో కామ్రేడ్ల రూట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 25 సీట్లపై కన్నేసి కామ్రేడ్లు... హుస్నాబాద్ సీటు విషయంలో కేసీఆర్ ఆఫర్ కు సై అంటారా..? లేక పోటీ చేస్తామని తేల్చి చెబుతారా..? అనేది వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే..!