CM KCR On CBI: సీఎం కేసీఆర్ కూడా ఆ నిర్ణయం తీసుకుంటారా..? హింట్ ఇచ్చినట్టేనా..?-behind the reasons of cm kcr comments on denial of cbi entry in bihar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr On Cbi: సీఎం కేసీఆర్ కూడా ఆ నిర్ణయం తీసుకుంటారా..? హింట్ ఇచ్చినట్టేనా..?

CM KCR On CBI: సీఎం కేసీఆర్ కూడా ఆ నిర్ణయం తీసుకుంటారా..? హింట్ ఇచ్చినట్టేనా..?

Mahendra Maheshwaram HT Telugu
Nov 10, 2022 02:44 PM IST

CM KCR Key Comments ON CBI: బిహార్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా బిహార్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఈ నేపథ్యంలో ఆయన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో... టీ సర్కార్ కూడా ఆ దిశగా అడుగులు వేయటం పక్కానే అనే టాక్ వినిపిస్తోంది.

<p>తెలంగాణ సీఎం కేసీఆర్&nbsp;</p>
తెలంగాణ సీఎం కేసీఆర్ (HT)

CM KCR Comments ON CBI: 'సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోంది. సీబీఐని బిహార్​లోకి అనుమతించకపోవడాన్ని సమర్థిస్తున్నాను. ప్రతీ రాష్ట్రం ఇదే చేయాలి. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం. సీబీఐ లాంటి సంస్థలు రాష్ట్రాల్లోకి చొరబడటం కరెక్ట్ కాదు'... ఇవీ బిహార్ పర్యటనలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్...! సరిగ్గా ఈ కామెంట్సే ఓ అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నాయి. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోవటం ఖాయమేనా అన్న చర్చ సర్వత్రా మొదలైంది.

హింట్ ఇచ్చినట్లేనా...

CM KCR Bihar Tour: బిహార్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్... సీఎం నితీశ్ కుమార్ తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్... కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దాడులను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే సీబీఐని బిహార్​లోకి అనుమతించకపోవడాన్ని సమర్థిస్తున్నానట్లు తెలిపారు. ప్రతి రాష్ట్రం ఇదే చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో ఇదే రకమైన ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ జారీ చేయబోతోందా ? సమయాన్ని బట్టే కేసీఆర్ హింట్ ఇచ్చారా అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఇప్పటికే తమ రాష్ట్రంలో సీబీఐ రావాలంటే అనుమతి తీసుకోవడం తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ జాబితాలో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి రాష్ట్రం కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ పిలువు ఇవ్వటమే... ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. బిహార్ వేదికగా తన మనసులోని మాటను చెప్పటంతో... కేసీఆర్ ఓ హింట్ ఇచ్చేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అప్పట్లో చంద్రబాబు కూడా…

CBI Raids On RJD Leaders: ఇటీవల బిహార్‌లో లాలూ కుటుంబసభ్యులు, ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు చేయడంతో.. బీహార్ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1946 సెక్షన్‌ ప్రకారం.. ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తు నిర్వహించాలంటే సీబీఐ ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ రాష్ట్రాలు తమ సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటే ఆ రాష్ట్ర పరిధిలో ఏదైనా కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఈ తరహాలోనే 9 రాష్ట్రాలు తమ సమ్మతిని వెనక్కి తీసుకున్నాయి. గతంలో ఏపీ ప్రభుత్వం (చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు) సైతం సమ్మతిని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

మొత్తంగా కేసీఆర్ మాటలను బట్టి.. పరిస్థితులు మారితే తెలంగాణ ప్రభుత్వం కూడా సీబీఐ ఎంట్రీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవటం ఖాయంగానే కనిపిస్తోంది. బిహార్ నుంచి రాష్ట్రానికి సీఎం తిరిగివచ్చాక ఈ తరహా ఉత్తర్వులు వస్తాయా లేక మరికొద్ది సమయం తీసుకుంటారా అనేది చూడాలి. ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే... రాజకీయంగా పెద్ద చర్చకే దారి తీసినట్లు అవుతందనే వాదన కూడా వినిపిస్తోంది.

Whats_app_banner