CBI raids in Bihar : నితీశ్ ప్ర‌భుత్వ బ‌ల‌ప‌రీక్ష వేళ‌.. బిహార్‌లో సీబీఐ దాడులు-land for job scam cbi raids 25 different places including delhi haryana ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbi Raids In Bihar : నితీశ్ ప్ర‌భుత్వ బ‌ల‌ప‌రీక్ష వేళ‌.. బిహార్‌లో సీబీఐ దాడులు

CBI raids in Bihar : నితీశ్ ప్ర‌భుత్వ బ‌ల‌ప‌రీక్ష వేళ‌.. బిహార్‌లో సీబీఐ దాడులు

HT Telugu Desk HT Telugu
Aug 24, 2022 06:53 PM IST

జేడీయూ నేత నితీశ్ కుమార్ బిహార్ అసెంబ్లీలో బ‌ల ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో.. ఆ ప్ర‌భుత్వంలో భాగ‌మైన ఆర్జేడీ నేత‌ల ఇళ్ల‌పై సీబీఐ దాడులు చేసింది.

<p>లాలు ప్ర‌సాద్ యాద‌వ్</p>
<p>లాలు ప్ర‌సాద్ యాద‌వ్</p>

`ల్యాండ్ ఫర్ జాబ్‌` స్కామ్ ద‌ర్యాప్తులో భాగంగా ఈ దాడులు చేస్తున్న‌ట్లు సీబీఐ తెలిపింది. రాష్ట్రంలో అధికారానికి దూర‌మైన క‌క్ష‌తోనే బీజేపీ ఈ దాడులు చేయిస్తోంద‌ని ఆర్జేడీ ఆరోపించింది.

CBI raids in Bihar : సీబీఐ దాడులు

బుధ‌వారం ఉద‌యం నుంచి బిహార్ కొత్త ప్ర‌భుత్వంలో భాగ‌మైన ఆర్జేడీ సీనియ‌ర్‌ నేత‌ల ఇళ్ల‌పై సీబీఐ దాడులు ప్రారంభించింది. బుధ‌వారం సాయంత్రం వ‌ర‌కు కూడా వారి ఇళ్లు, కార్యాల‌యాల‌పై సోదాలు కొన‌సాగుతున్నాయి. ఆర్జేడీ ఎంపీలైన‌ అహ్మ‌ద్ అష్ఫ‌ఖ్ క‌రీమ్‌, డాక్ట‌ర్ ఫ‌యాజ్ అహ్మ‌ద్‌, ఎమ్మెల్సీ సునీల్ సింగ్ ఇళ్ల‌పై సీబీఐ దాడులు చేసింది. ఈ దాడుల్లో కీల‌క‌మైన డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని సీబీఐ వెల్ల‌డించింది.

CBI raids in Bihar : మేం భ‌య‌ప‌డం..

అధికారం కోల్పోవ‌డంతో, క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగా ఆర్జేడీ నేత‌ల ఇళ్ల‌పై సీబీఐతో దాడులు చేయిస్తున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై, బీజేపీపై ఆర్జేడీ నేత‌లు మండిప‌డ్డారు. ఆర్జేడీ చీఫ్ లాలు ప్ర‌సాద్ యాద‌వ్ భార్య రబ్రీదేవీ ఈ దాడుల‌ను తీవ్రంగా ఖండించారు. `రాష్ట్రంలో బీజేపీ అధికారం కోల్పోయింది. నితీశ్‌కుమార్ నేతృత్వంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. బీజేపీ మిన‌హా అన్ని పార్టీలు మాతోనే ఉన్నాయి. దాంతో వారు భ‌య‌ప‌డ్తున్నారు. మ‌మ్మ‌ల్ని భ‌య‌పెట్ట‌డానికి సీబీఐతో దాడులు చేయిస్తున్నారు. కానీ మేం భ‌య‌ప‌డం. ఇలాంటి దాడులు మాకు కొత్తేం కాదు`` అని ర‌బ్రీ దేవీ వ్యాఖ్యానించారు.

CBI raids in Bihar : స్కామ్ ఏంటి?

కేంద్రంలో యూపీఏ 1 ప్ర‌భుత్వం ఉన్న 2004-2009 మ‌ధ్య‌ స‌మ‌యంలో లాలు ప్ర‌సాద్ యాద‌వ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో రైల్వే ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌లో అవినీతికి పాల్ప‌డ్డార‌ని లాలు యాద‌వ్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రైల్వే లో ఉద్యోగాలు క‌ల్పించి, అందుకు బ‌దులుగా ఉద్యోగార్థుల నుంచి భూములు, ఆస్తులు తీసుకున్నార‌ని లాలు ప్ర‌సాద్ యాద‌వ్ కుటుంబ స‌భ్యుల‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దాంతో ఈ స్కామ్‌ను `ల్యాండ్ ఫ‌ర్ జాబ్‌`గా పిల‌వ‌డం ప్రారంభించారు. ఈ సంవ‌త్స‌రం జూన్ నెల‌లో ఈ స్కామ్‌కు సంబంధించి లాలు యాద‌వ్ స‌న్నిహితుడు భోలా యాద‌వ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. విచార‌ణ‌లో భోలా యాద‌వ్ ఇచ్చిన స‌మాచారం మేర‌కే ఈ రోజు సీబీఐ ఆర్జేడీ నేత‌ల ఇళ్ల‌పై దాడులు చేసిన‌ట్లు స‌మాచారం.