TRS: మరోసారి గులాబీ బాస్ క్లారిటీ… డైలామాలో సొంత పార్టీ నేతలు!-trs leaders unhappy with kcr statement over seats to sitting mlas in next elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Trs Leaders Unhappy With Kcr Statement Over Seats To Sitting Mlas In Next Elections

TRS: మరోసారి గులాబీ బాస్ క్లారిటీ… డైలామాలో సొంత పార్టీ నేతలు!

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 09:20 AM IST

KCR Statement On MLAs Seats: తాజాగా జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదన్న ఆయన... సిట్టింగ్ లకే సీట్లు అంటూ మరోసారి ప్రకటన చేశారు. గులాబీ బాస్ చేసిన ఈ ప్రకటన... కొందరు నేతలకు టెన్షన్ పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్
టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ (twitter)

TRS Chief KCR On MLAs Seats: "శాసనసభ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు. ఎవరినీ మార్చబోం.. మళ్లీ సిటింగులకే టికెట్లు ఇస్తాం. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్సే ఘన విజయం సాధిస్తుంది. 95కుపైగా స్థానాలు సాధిస్తుందని అన్ని సర్వేలు నివేదిస్తున్నాయి" ఇవి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. మంగళవారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీపక్ష, పార్టీ కార్యవర్గ సంయుక్త సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు.. పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. గులాబీ బాస్ ప్రకటన సిట్టింగ్ లకు బూస్టింగ్ ఇచ్చినట్లు అయితే...పలువురు సీనియర్ లీడర్లతో పాటు టికెట్ ఆశిస్తున్నవారు డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే… నిజంగానే సిట్టింగ్ లకే సీట్లు దక్కే అవకాశం ఉందా..? పలుచోట్ల టికెట్లు ఆశిస్తున్న నేతల పరిస్థితేంటి..? అసలు గులాబీ బాస్ ప్లాన్ ఏంటన్న చర్చ జోరందుకుంది.

ట్రెండింగ్ వార్తలు

గతంలోనూ సిట్టింగ్ లకే సీట్లు అంటూ ప్రకటన కూడా చేశారు కేసీఆర్. తాజాగా కూడా ఇదే విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. అధినేత మరోసారి ప్రకటన చేయటంతో... ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఖూషీ అయిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న... కొన్నిస్థానాల్లో మాత్రం ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనే చర్చ మొదలైంది. 2018లో జరిగిన ఎన్నికలో పలువురు సీనియర్ నేతలకు షాక్ తగిలింది. ఆ ఎన్నికలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇందులో కొందరు మంత్రులు కూడా ఉన్నారు. స్పీకర్ గా ఉన్న మధుసూదనచారి కూడా విజయం సాధించలేకపోయారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కారు ఎక్కారు. ఆయా నియోజకవర్గాల్లో వారిదే పైచేయి అన్నట్లు తాజా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో... మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు తాజాగా టికెట్లు ఆశిస్తూ పార్టీ కోసం పని చేస్తున్న వారి పరిస్థితేంటో ఎంటన్నది ఇంట్రెస్టింగ్ మారింది.

టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర రావు, పట్నం మహేందర్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. భూపాలపల్లి నుంచి గెలిచిన మధుసూదనచారి స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఇదే స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్ లోకి వచ్చారు. కేసీఆర్ అన్నట్లు సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తే... మాజీ మంత్రుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి టగ్ ఆఫ్ వార్ అన్నట్లు తయారైంది. ఈ మధ్య తుమ్మల భారీ ర్యాలీ నిర్వహించారు. మళ్లీ యాక్టివ్ అయిపోయారు. కేసీఆర్ తోనే ప్రయాణమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాలేరు టికెట్ ఎవరికి రాబోతుందనేది అత్యంత ఆసక్తిని రేపుతోంది. తాండూరులోనూ పరిస్థితి ఇలాగే ఉంది

ఇవే కాకుండా...చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ధీటుగా మరో నాయకత్వం కూడా పని చేస్తూ ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. గ్రేటర్ లో చూస్తే... ఉప్పల్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ మాజీ మేయర్ టికెట్ రేసులో ఉన్నారు. గతంలోనే సీరియస్ గా ట్రై చేసి వెనక్కి తగ్గారు. నెక్స్ట్ తనకే అన్నట్లు పని చేస్తున్నారు. మహేశ్వరం, చెవేళ్లలో చూస్తే కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. వీరి కాకుండా... ప్రస్తుతం ఉన్న కొందరు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా టికెట్లపై కన్నేశారు. ఆ దిశగా ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే.. మరో అంశం కూడా పలువురు ఎమ్మెల్యేలతో పాటు టికెట్లు ఆశిస్తున్న వారికి ఇబ్బందిగా మారనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికలో కామ్రేడ్లతో కలిసి బరిలోకి దిగిన కేసీఆర్... వచ్చే ఎన్నికల్లోనూ కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని పలు సీట్లపై కన్నేశారు. పొత్తులో భాగంగా తమకు కేటాయించాలంటూ కేసీఆర్ ముందు ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉంది. ఆ దిశగా చర్చలు కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలో... వీటిలో కొన్ని సీట్లు కేటాయించినా... సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కే అవకాశం ఉండదు.

ఈ నేపథ్యంలో తలెత్తే సమస్యలకు గులాబీ బాస్ కేసీఆర్ ఎలా చెక్ పెడతారనే డిస్కషన్ కూడా జరుగుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే.. కొంతమంది నేతలు కారు దిగే అవకాశం లేకపోలేదు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే పలువురికి ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులు హామీతో బుజ్జగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే నామినేటెడ్ పదవులతో సదరు నేతలు సైలెంట్ అవుతారా..? లేక కారు దిగి ఇతర పార్టీల వైపు చూస్తారా అనేది చూడాలి..!

IPL_Entry_Point