Rythu Bandhu Scheme : 5 ఎకరాల వరకే రైతుబంధు..! మారనున్న డబ్బుల జమ విధానం..? తాజా అప్డేట్స్ ఇవే-telangana government is working on changing the guidelines of rythubandhu scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Bandhu Scheme : 5 ఎకరాల వరకే రైతుబంధు..! మారనున్న డబ్బుల జమ విధానం..? తాజా అప్డేట్స్ ఇవే

Rythu Bandhu Scheme : 5 ఎకరాల వరకే రైతుబంధు..! మారనున్న డబ్బుల జమ విధానం..? తాజా అప్డేట్స్ ఇవే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 23, 2024 01:05 PM IST

Rythu Bandhu Scheme Latest News: పంట పెట్టుబడి (రైతు బంధు) సాయం స్కీమ్ మార్గదర్శకాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ లోని పలువురు మంత్రులు కూడా మార్పు విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే సీజన్ లోపే కొత్త మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది.

రైతుబంధు స్కీమ్
రైతుబంధు స్కీమ్

Guidelines of Rythu bandhu Scheme: రైతుబంధు(Rythu bandhu) స్కీమ్ ను రైతు భరోసాగా(Ryhthu Bharosa) మార్చేందుకు ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీనిపై అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్న నేపథ్యంలో…. ఎన్నికల పూర్తి అయిన తర్వాత ఈ స్కీమ్ కు సంబంధించి కీలకమైన మార్గదర్శకాలను విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో…. గతంలో ఉన్న రైతుబంధు స్కీమ్ మార్గదర్శకాలను మార్చేందుకు కూడా సర్కార్ కసరత్తు చేస్తోంది. నిజానికి ఈ యాసంగి సీజన్ లోనే మార్గదర్శకాలు మారుతాయని అంతా భావించినప్పటికీ… సర్కార్ మాత్రం గతంలోనే ఉన్న మార్గదర్శకాలతోనే నిధులను జమ చేస్తామని ప్రకటించింది. అందుకే తగ్గట్టుగానే నిధుల జమ ప్రక్రియను ప్రారంభించింది.

కొనసాగుతున్న నిధుల జమ ప్రక్రియ

ఇక ఈసారి పంట పెట్టుబడి సాయం నత్తనడకన సాగుతూ వచ్చింది. మొదట గుంటలవారీగా జమ చేస్తూ వచ్చింది ప్రభుత్వం. సంక్రాంతి ముందు వరకు కూడా  నిధులు జమ స్పీడ్ గా జరగలేదు. పండగ తర్వాత…. జమ ప్రక్రియను వేగవంతం చేసింది సర్కార్.  ప్రస్తుతం 4 నుంచి ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అయినట్లు తెలుస్తోంది. అయితే ఐదు ఎకరాల కంటే భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయా..? లేదా…? అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక నిధుల జమ ప్రక్రియపై కూడా ప్రభుత్వంలోని మంత్రులు కూడా భిన్నమైన ప్రకటనలు చేస్తుండటంతో… ఎంత విస్తీరణంలోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బుల జమ అవుతాయనేది తేలాల్సి ఉంది.

త్వరలోనే రైతుభరోసాగా మార్పు…

గత ప్రభుత్వ హయాంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చింది. ఎకరానికి రూ. 5 వేలను జమ చేస్తూ వచ్చింది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా... కాంగ్రెస్ పార్టీ ఈ స్కీమ్ పై ప్రకటన చేసింది. రైతు భరోసా స్కీమ్ కింద కు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని హామీనిచ్చింది. వ్యవసాయ కూలీలను కూడా గుర్తించి… ఆర్థిక సాయం ఇస్తామని పేర్కొంది. దీంతో త్వరలోనే రైతుబంధు స్కీమ్ ను రైతుభరోసాగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే వ్యవసాయ ఆ శాఖ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

సీలింగ్ విధింపు…?

ఇకపై పంట పెట్టుబడి సాయం ఐదు ఎకరాలకే పరిమితం కానుంది. ఈ మేరకు సర్కార్ కూడా ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీలింగ్ అంశంపై ప్రభుత్వ పెద్దలు కూడా చాలా సార్లుప్రకటనలు చేశారు.  ఇదిలా ఉంటే పంట పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలి…? అసలైన అర్హుల గుర్తింపు ఎలా వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సాగు చేసే భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందాలన్న లక్ష్యంతో సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలో…. సాగు చేయకుండా ఉండే వాటికి సాయం కట్ కానుంది. అయితే పంట పెట్టుబడి సాయాన్ని… గతంలో సాగుకు ముందుగా ఇచ్చేవారు. అయితే ఈసారి సాగు చేసిన తర్వాత మధ్యలో కానీ.. చివర్లో కానీ ఇచ్చే అంశంపై కూడా సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇందుక కారణాలు లేకపోలేదు. సాగుకు ముందే డబ్బులు జమ చేస్తే… పంట వేసే విషయంలో ప్రభుత్వానికి పక్కా సమాచారం ఉండటం లేదు. కానీ పంట వేసిన తర్వాత…. శాటిలైట్ సేవల ద్వారా సాగు చేశారా లేదా అనేది మాత్రం గుర్తించే వీలు ఉంటుంది. ఫలితంగా సదరు రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసే ఛాన్స్ ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాగుకు ముందే డబ్బులు అందింతే…. పెట్టుబడికి ఉపయోగపడుతుందన్న వాదన బలంగా తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో…. వ్యవసాయశాఖ మార్గదర్శకాల విషయంలో  ఓ క్లారిటీకి రాలేకపోతుందన్న సమాచారం అందుతోంది. 

ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో…. కొత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఎన్నికలు ముగియగానే…. రైతుభరోసా స్కీమ్ తో పాటు మార్గదర్శకాలపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. తుది ఉత్తర్వులకు అనుగుణంగా పంట పెట్టుబడి సాయం అందించనుంది. 

 

Whats_app_banner