CM Revanth Reddy : 'రైతు భరోసా' ద్వారా పంట పెట్టుబడి సాయం - కొత్త స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Congress Booth Level Meeting in Hyderabad : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బూత్‌స్థాయి కన్వీనర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్… బీఆర్ఎస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుభరోసా స్కీమ్ అమలుపై కీలక ప్రకటన చేశారు.
CM Revanth Reddy : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తరిమికొడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశంలోమాట్లాడిన ఆయన… కేసీఆర్, కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించామని… వచ్చే ఎన్నికల్లో తరిమికొడుతామన్నారు. పులి వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు… పులి వస్తే బోనులో పెట్టి బొందపెడతామని ఘాటుగా మాట్లాడారు. కేసీఆర్ కాస్కో అంటూ సవాల్ విసిరారు. మోదీ - కేసీఆర్ వేర్వురు కాదన్నారు.
రేవంత్ రెడ్డిని మేస్త్రీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అవును తాను మేస్త్రీనే… తెలంగాణను పునర్‌నిర్మించే మేస్త్రీనే అంటూ కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో పేపర్ లీకులతో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తే… ఇవాళ పారదర్శకంగా టీఎస్పీఎస్సీలో నియమించామని చెప్పారు. లోక్ సభ ఎన్నికలకు ఇంద్రవెల్లి నుంచి శంఖారావం పూర్తిస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని చెప్పారు. వెడ్మ బొజ్జు లాంటి వ్యక్తులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని… అదే బీఆర్ఎస్ పార్టీ వ్యాపారులను రాజ్యసభ సభ్యులుగా నియమించిందని దుయ్యబట్టారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకమని…రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి అందరం కష్టపడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 14 సీట్లకు తగ్గకుండా ఎంపీలను గెలిపించుకోవాలని కోరారు.
“పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొద్దాం. మోదీని ఓడించాలి.. రాహుల్‌ని ప్రధాని చేయాలి. కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కార్యకర్తల కష్ట ఫలితం కారణంగానే నేను ఈ గౌరవ స్థానంలో నిలబడ్డాను. రాహుల్ పాదయాత్రతో మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. నెహ్రూ కుటుంబం త్యాగాలతోనే దేశం అభివృద్ధి సాధించింది” అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
పంట పెట్టుబడి సాయంపై కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి నెలాఖారులోపు రైతు భరోసా(రైతుబంధు) ద్వారా నగదు అందిస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 హామీలను అమలు చేస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేసి చూపిస్తామని పునరుద్ఘాటించారు.
మోదీపై ఖర్గే ఫైర్….
కార్యకర్తల కృషితో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఆరు గ్యారెంటీలలో రెండు అమలు చేశామని,… ఇంకో రెండు గ్యారంటీలు త్వరలోనే అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. నల్ల ధనం తెస్తా అన్నారు.. తెచ్చారా..? అంటూ నిలదీశారు. రాహుల్ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీలు గెలుచుకునేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ నేతలకు భట్టి వార్నింగ్….
బిఆర్ఎస్ నాయకులు బట్టలు ఊడదీసి కొడతామంటే కాంగ్రెస్ కార్యకర్తలు చేతులు ముడుచుకొని లేరన్నారు డిప్యూటీ సీఎం భట్టి. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కన్నెర్ర చేస్తే రాష్ట్రంలో టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ మిగలదని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలను ప్రజాస్వామ్యయుతంగా గౌరవించాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని, దీనిని చేతగాని తనంగా భావించి బట్టలు ఊడదీసి కొడతామంటే మా తడాఖా ఏంటో కూడా చూపిస్తామన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు.