CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు-hyderabad news in telugu four brs mlas meet cm revanth reddy cordially ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Bandaru Satyaprasad HT Telugu
Jan 23, 2024 08:35 PM IST

CM Revanth Reddy : నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) , గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు) ,మాణిక్ రావు (జహీరాబాద్) సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. తమ తమ నియోజకవర్గాలలోని సమస్యలను సీఎంకు విన్నవించారని సమచారం.

రాజకీయ వర్గాల్లో చర్చ

దావోస్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటును సరిదిద్దుకుని లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం.. లోక్ సభ నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ తరుణంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం ఆసక్తిగా మారింది. అయితే నియోజకవర్గాల్లోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆ నేతలు చెబుతున్నారు. అయినా ఈ భేటీ ఎటుదారితీస్తుందో అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

30 మంది కాంగ్రెస్ తో టచ్ లో

ఇటీవల దావోస్ పర్యటనలో బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతులో పాతిపెడతామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనం రేపాయి. బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు 39 ముక్కలవుతారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారన్నారు. ఈ నేపథ్యంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ సంచలనంగా మారింది. వీరు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా? అనే చర్చ మొదలైంది.

సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు ముందు నుంచీ బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇటీవల రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలోని ప్రకాశ్ గౌడ్ నివాసానికి వెళ్లిన మంత్రి ప్రభాకర్ గౌడ్.. ఆయనతో భేటీ అయ్యారు. ప్రకాశ్ గౌడ్‌ను పొన్నం ప్రభాకర్ కలవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారానే ప్రచారం కూడా జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిచింది. సాధారణ మెజార్టీకి నాలుగు సీట్లు ఎక్కువ సాధించింది. ఇటీవల కొందరు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.

Whats_app_banner