CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం, సెక్యూరిటీ సిబ్బంది మార్పు!-hyderabad news in telugu cm revanth reddy security changed after personal information leaked ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం, సెక్యూరిటీ సిబ్బంది మార్పు!

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం, సెక్యూరిటీ సిబ్బంది మార్పు!

Bandaru Satyaprasad HT Telugu
Jan 24, 2024 02:25 PM IST

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంపై సీఎంవో అధికారులు, ఇంటెలిజెన్స్ అలర్ట్ అయ్యారు. సీఎం వ్యక్తిగత సమాచారం బయటకు తెలియడంతో భద్రతా సిబ్బందిని మార్చారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చి కొత్త వారిని నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత, అధికారిక సమచారం బయటకు తెలియడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం దావోస్ పర్యటన ముగిసిన అనంతరం భద్రతా సిబ్బంది మార్పు చేశారు. తన వ్యక్తిగత సమాచారం బయటకు తెలియడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసలు విషయంపై ఆరా తీసిన సీఎంవో అధికారులు, ఇంటెలిజెన్స్...మాజీ కేసీఆర్ వద్ద పనిచేసిన కొందరు సిబ్బంది ప్రస్తుత భద్రతా సిబ్బందిలో ఉండడంతో వారిలో కొందరు ముఖ్యమైన సమాచారం బయటకు వెళ్తుందని గ్రహించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉండే పోలీసు సిబ్బంది, ఇంటి వద్ద భద్రతా సిబ్బందిని మార్చారు. దావోస్ పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా ఇంటి వద్దే ఉన్నారు. ఇవాళ ఆయన సచివాలయానికి రానున్నారు.

సీఎంను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు- పార్టీ మారే ఉద్దేశం లేదంటూ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం సాయంత్రం నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) , గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు) ,మాణిక్ రావు (జహీరాబాద్) సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. తమ తమ నియోజకవర్గాలలోని సమస్యలను సీఎంకు విన్నవించారని సమచారం. అయితే ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని జోరు ప్రచారం జరిగింది.

పార్టీ మారుతున్నారంటూ కథనాలు వెలువడటాన్ని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. నలుగురు ఎమ్మెల్యేలు ముఖ‌్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడంతపై పెద్ద ఎత్తున కథనాలు వెలువడటంతో తాము పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశాలతో దుష్ప్రచారం చేస్తున్నారని, నలుగురు ఎమ్మెల్యేలు కలిసి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించారని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. పార్టీకి మా మీద నమ్మకం ఉందని సునీత లక్ష్మారెడ్డి చెప్పారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతున్న నేపథ్యంలో మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఎవరికి వివరణ ఇవ్వడానికి తాము రాలేదని, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, దురుద్దేశాలతో లేనిపోని మాటలతో అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆరోపించారు.

తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తనకు ఎదురవుతున్నా ఇబ్బందులతో పాటు అభివృద్ధి విషయంలో తమకు సహకరించాలని మాత్రమే సిఎంను కోరినట్టు చెప్పారు. పార్టీ మారే ఆలోచన తమకు లేదని ఆమె స్పష్టం చేశారు. నిబద్ధతతో, క్రమశిక్షణతో బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రిని కలవడం తప్పన్నట్లు వ్యవహరిస్తున్నారని, సిఎంను కలిసి నియోజక వర్గ సమావేశాల మీద మాట్లాడటం తమ హక్కని చెప్పారు. సిఎం కూడా కేంద్రంలో మంత్రులు, ప్రధాన మంత్రిని కలుస్తున్నారని, ఇదో సాధారణ ప్రక్రియ మాత్రమేనని చెప్పారు.

Whats_app_banner