Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!-rajanna sircilla crime news parents killed mentally ill daughter not preferred for treatment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

HT Telugu Desk HT Telugu
Updated May 19, 2024 09:08 PM IST

Sircilla Crime : మానసిక పరిస్థితి సరిగా లేని కూతురికి సరైనా వైద్యం అందించకుండా బాబాలు, భూతవైద్యల వద్దతు తిప్పుతూ ఇల్లు గుల్ల చేసుకున్నారు తల్లిదండ్రులు. చివరికి కూతురిని చికిత్స చేయించే స్థోమతలేక...ఉరి వేసి హత్య చేశారు.

పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!
పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sircilla Crime : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. మానసిక రోగం బిడ్డ ప్రాణాలు తీసింది. పేరెంట్స్ ను కటకటాల పాలు చేసింది. మానసిక స్థితి సరిగా లేని బిడ్డకు వైద్యం చేయించాల్సిన పేరెంట్స్ గుళ్లు గోపురాలు బాబాల చుట్టూ తిరిగి అప్పులపాలై చివరికి మానసిక స్థితి సరిగాలేని బిడ్డ భారంగా మారిందని భావించి ఉరేసి ప్రాణం తీశారు. పేగుబంధాన్ని తెంచుకున్న కసాయి తల్లిదండ్రులు, మృతురాలి కడుపున పుట్టిన 13 నెలల బాబును అనాథను చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య, ఎల్లవ్వ దంపతుల పెద్ద కూతురు ప్రియాంక ఈనెల 14న అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మానసిక స్థితి సరిగా లేని ప్రియాంక మృతిపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేయగా గ్రామపంచాయతీ కార్యదర్శి రాజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి తంగళ్ళపల్లి పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పేరెంట్స్ నర్సయ్య ఎల్లవ్వ నూలు దారంతో పేనిన తాడుతో ఉరివేసి చంపినట్లు విచారణలో తేలింది. ప్రియాంక హత్యకు ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు.

ప్రాణం తీసిన మానసిక రోగం

ప్రియాంక గత ఏడు సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతుంది. తల్లిదండ్రులు ప్రియాంకను పలు ఆసుపత్రులతోపాటు దేవాలయాల చుట్టూ తిప్పి వైద్యం చేయించడంతో కొంత నయం అయింది. ఆరోగ్యంగా ఉన్న ప్రియాంకను 2020 సంవత్సరంలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి చెందిన పృధ్వీకి ఇచ్చి వివాహం చేశారు. వారు బతుకుదెరువు కోసం కరీంనగర్ లోని సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్నారు. వారికి 13 నెలల కుమారుడు ఉన్నారు. గత నెల రోజులుగా ప్రియాంక మునుపటిలాగే మానసికస్థితి సరిగా లేక అరవడం ఎవరిని పడితే వారిని దూషించడం గొడవ పెట్టుకోవడంతోపాటు 13 నెలల బాలుడిని సైతం కింద పడేసి కొట్టడంతో భర్త పృధ్వీ ఆమె పరిస్థితి గురించి పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. పేరెంట్స్ నర్సయ్య ఎల్లవ్వ కూతురును స్వగ్రామం నేరెళ్లకు తీసుకెళ్లి మానసిక వ్యాధి నయం కోసం బుగ్గ రాజేశ్వర స్వామి టెంపుల్ వద్దకు తీసుకెళ్లి అక్కడ మూడు రోజులు ఉంచారు. అక్కడ నయం కాకపోవడంతో పలు చోట్ల బూత వైద్యులకు సైతం చూపించారు. అయినా ప్రియాంక పరిస్థితి మారకపోవడంతో విసిగిపోయిన తల్లిదండ్రులు కుమార్తె తీసుకొని నేరెళ్లలోని సొంత ఇంటికి చేరారు. విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్న బిడ్డకు వైద్యం చేయించే స్థోమత లేక ఇక బిడ్డ ఆరోగ్యం మెరుగుపడదని భావించి మంగళవారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో మెడకు నూలుతాడుతో ఉరి వేసి ప్రియాంక ప్రాణాలు తీశారు. ప్రియాంక మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో అన్ని కోణాల్లో ఆరా తీయగా హత్య విషయం వెలుగులోకి వచ్చిందని ఎస్పీ తెలిపారు.

మూఢనమ్మకాలు నమ్మవద్దు

మూఢ నమ్మకమే ప్రియాంక ప్రాణాలు తీసిందని స్థానిక ప్రజలతోపాటు పోలీసులు భావిస్తున్నారు. రోగం వచ్చినా నొప్పి లేచినా నాటువైద్యం, బూత వైద్యం అంటూ బాబాలను, మంత్రగాళ్లను సంప్రదించకుండా సరైన వైద్యం అందించాలని ఎస్పీ కోరారు. అవగాహన రాహిత్యంతోనే ప్రియాంక ప్రాణాలు కోల్పోయిందని తద్వారా పేరెంట్స్ నిందితులుగా మారి జైలు పాలు అయ్యారని చెప్పారు. ఆమె కడుపున పుట్టిన బిడ్డ అనాథగా మారే పరిస్థితి ఏర్పడిందన్నారు. గుళ్లు గోపురాలు, బూతవైద్యులను సంప్రదించి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోవద్దని సూచించారు. ఎక్కడైనా భూతవైద్యం, నాటు వైద్యం అంటూ ప్రచారం చేసినా, అలాంటివి ఎక్కడైనా ఉంటే వెంటనే 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar

Whats_app_banner