KCR Brother Son Arrest : మన్నెగూడ భూకబ్జా కేసు, కేసీఆర్ అన్న కుమారుడు అరెస్టు
KCR Brother Son Arrest : భూకబ్జా ఆరోపణలతో మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కన్నారావు, తన అనుచరులతో కలిసి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు.
KCR Brother Son Arrest : భూ వివాదం(Land Grabbing) కేసులో మాజీ సీఎం కేసీఆర్ (KCR)సోదరుడి కుమారుడు తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. మన్నెగూడ భూవివాదం కేసులో కన్నారావు ఏ1 గా ఉన్నారు. ఆదిభట్ల పోలీసులు కన్నారావును ఇవాళ అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిన్న హైకోర్టు కన్నారావు ముందస్తు బెయిల్ ను తిరస్కరించిన విషయం తెలిసిందే. మన్నెగూడలో 2 ఎకరాల భూమి కబ్జా చేసేందుకు కన్నారావు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా భూవివాదంలో పలువురిపై దాడి చేసిన ఘటనలో కన్నారావుతో పాటు 35 మందిపై ఆదిభట్ల పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు.
భూకబ్జా ఆరోపణలు
ఈ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్(Bail) కోసం కన్నారావు రెండు సార్లు ప్రయత్నించారు. అయితే హైకోర్టు ముందస్తు బెయిల్ కు తిరస్కరించింది. కన్నారావు కోసం పోలీసులు ఇటీవల లుక్ ఔట్ నోటీసులు జారీచేశారు. కల్వకుంట్ల కన్నారావు(Kalvakuntla Kannarao)పై 147, 148, 447, 427, 307, 436, 506, r/w149 సెక్షన్ల కింద ఆదిభట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మన్నెగూడ పరిధిలో 32 సర్వే నెంబర్ లో గల 2.15 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ గత నెల 3న ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కల్వకుంట్ల కన్నారావు సహా 38 మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
కల్వకుంట్ల కన్నారావు ప్రధాన అనుచరుడు డేనియల్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో తనపై నమోదు అయిన కేసులో తనకు ముందస్తు బెయిల్ కన్నారావు(Kannarao) హైకోర్టును(High Court) ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో కన్నారావు అరెస్టుకు లైన్ క్లియర్ అయింది. మంగళవారం ఆదిభట్ల పోలీసులు కన్నారావును అరెస్టు చేశారు. ఆయన కోర్టు రిమాండ్ విధించే అవకాశం ఉంది.
కేసీఆర్ కుటుంబ సభ్యులపై కేసులు
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని(KCR Family) కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే దిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha) అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆమెకు దిల్లీ కోర్టు రిమాండ్ విధించింది. కవిత ప్రస్తుత తీహార్ జైలులో ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై ఇటీవల క్రిమినల్ కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్(Santosh Kumar) పై భూవివాదంలో కేసు నమోదు అయ్యింది.