IND vs AUS 1st Test Toss: తొలి టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా - నితీష్, హర్షిత్ రాణా ఎంట్రీ!
IND vs AUS 1st Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. తొలి టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరం కావడంతో అతడి స్థానంలో పేసర్ బుమ్రా టీమిండియా సారథిగా వ్యవహరించబోతున్నాడు.
IND vs AUS 1st Test Toss: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నేడు (శుక్రవారం) తొలి టెస్ట్ ఆరంభమైంది. పెర్త్ వేదికగా జరుగుతోన్న ఈ టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. తొలి టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరం కావడంతో అతడి స్థానంలో బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇటీవలే తండ్రయ్యాడు రోహిత్ శర్మ. కుటుంబానికే మరికొద్ది రోజులు సమయాన్ని కేటాయించాలనే ఆలోచనతో తొలి టెస్ట్‌కు దూరమయ్యాడు.
కోహ్లిపైనే దృష్టి...
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి పైనే క్రికెట్ అభిమానుల దృష్టి ఎక్కువగా ఉంది. సీనియర్ బ్యాట్స్‌మెన్‌గా జట్టును ఏ విధంగా ముందుకు నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లి ఇప్పటివరకు ఎనిమిదిసెంచరీలు చేశాడు. ఈ సిరీస్‌లో హయ్యెస్ట్ రన్స్ చేసిన క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతోన్నాడు. ఈ జోరును మరోసారి కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ముగ్గురు కీలకం...
బ్యాటింగ్ పరంగా కోహ్లితో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌పైనే ఎక్కువగా భారం నెలకొంది.రోహిత్ దూరం కావడంతో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇండియా ఇన్నింగ్స్‌ను ఆరంభించబోతున్నాడు. దేవదత్ ఫడిక్కల్ మూడో స్థానంలో బ్యాటింగ్ రాబోతున్నాడు. తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఉపయోగపడి టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలతోనే ఉత్సాహంతో నితీష్ బరిలో దిగాడు.
కెప్టెన్సీ భారం...
బౌలర్‌గానే కాకుండా కెప్టెన్‌గా బుమ్రాపై మరింత భారం పెరిగింది. పెర్త్ పిచ్ పేస్‌కు అనూకులంగా ఉంటుంది. షమీని కాదని అంతగా ఫామ్‌లో లేని సిరాజ్‌కే మరోసారి టీమ్ మేనేజ్‌మెంట్ తుది జట్టులో చోటివ్వడం ఆసక్తికరంగా మారింది. బుమ్రా, సిరాజ్, రాణా త్రయం ఆసీస్‌ను ఏ మేరకు కట్టడి చేస్తుందన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక స్పిన్ భారం మొత్తం వాషింగ్టన్ సుందర్‌పైనేఉంది. జడేజా, అశ్విన్ లేని లోటును సుందర్, నితీష్ ఏ మేరకు భర్తీ చేస్తారన్నది చూడాల్సిందే.
టీమిండియా తుది జట్టు ఇదే...
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ ఫడిక్కల్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, విరాట్ కోహ్లి, బుమ్రా, సుందర్, సిరాజ్, హర్షిత్ రాణా, ధ్రువ్ జురేల్
ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే...
ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, స్మిత్, హెడ్, మెక్ స్వీనే, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, స్టార్క్, కమిన్స్, లయాన్, హెజిల్ వుడ్...