Case On Kodangal Mla : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు, భూవివాదంలో బెదిరింపులు!
Case On Kodangal Mla : భూవివాదం కేసులో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Case On Kodangal Mla : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదు అయింది. కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇంద్రపాల్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ పరిధిలోని ఉప్పరపల్లిలో ఓ స్థలం కొనుగోలు చేసేందుకు ఇంద్రపాల్ రెడ్డి ప్రయత్నించారు. అయితే మధ్యవర్తులుగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రాకేశ్‌రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు. ఇంద్రపాల్ కు మరో వ్యక్తితో కలిసి రూ.3.65 కోట్లకు భూమి విక్రయిస్తామన్నారు. ఇందుకోసం కమీషన్ఇచ్చేందుకు ఇంద్రపాల్ అంగీకరించారు. స్థలం కొనుగోలులో విడతల వారీగా మొత్తం రూ.3.05 కోట్లు ఇచ్చారు. మిగిలిన రూ.60 లక్షల కోసం లోన్‌కి అప్లై చేశానని, లోన్ రాగానే చెల్లిస్తానని ఇంద్రపాల్ చెప్పారు. మిగిలిన డబ్బు చెల్లించడంలో ఆలస్యం అయిందని ఎమ్మె్ల్యే అనుచరులు తనను గదిలో బంధించి టార్చర్ చేశారని ఇంద్రపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోర్టు ఆదేశాలతో కేసు నమోదు
ఎమ్మె్ల్యే అనుచరులు తనను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇంద్రపాల్ రెడ్డి ఆవేదన చెందారు. చివరకు కోర్టును ఆశ్రయించానన్నారు. కోర్టు ఆదేశాలతో బంజారాహిల్స్ పోలీసులుఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోద చేశారని తెలిపారు. అనంతరం ఈ కేసును ఫిలింనగర్పోలీస్స్టేషన్ కు బదిలీ చేసి, దర్యాప్తు ప్రారంభించారు. భూ వివాదంలో కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2018లో ఉప్పర్‌పల్లిలోని భూమి కొనుగోలు వ్యవహారంలో కేసు నమోదు చేశారు పోలీసులు.
ఎమ్మెల్యే ఇంటికి రావాలని బెదిరింపులు
అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్... ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని సెక్షన్లు 342 (ఒక వ్యక్తిని తప్పుగా నిర్బంధించడం), 384 (దోపిడీ), 323 (ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా హాని కలిగించడం లేదా బాధపెట్టడం), 506 ప్రకారం చట్టపరమైన చర్యలను ప్రారంభించాలని పోలీసులను ఆదేశించారు. ఇంద్రపాల్ రెడ్డి తన ఫిర్యాదులో ఎమ్మెల్యే అనుచరులు బెదిరింపు సందేశాలు పంపారని, జూన్ 22, 2022న ఇంట్లో తాను సమయంలో ఇంటికి వెళ్లి తన భార్యను బెదిరించారని పేర్కొన్నారు. తనను ఎమ్మెల్యే నివాసానికి రావాలని ఒత్తిడి చేశారని తెలిపారు. క్రైం నంబర్ 544/2023 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.నవీన్‌రెడ్డికి అప్పగించి విచారణ జరుపుతున్నారు. భూమి కొనుగోలులో ఎమ్మెల్యే బాధితుడిని బలవంతం చేశారని, తప్పుడు వాగ్దానాలు చేసి ఆర్థికంగా నష్టపోయేలా చేశారని ఆరోపణలు వచ్చాయి.