Marriage Muhurat : తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పెళ్లి సందడి, రానున్న మూడు నెలల్లో మంచి ముహూర్తాలు
Marriage Muhurat : మాఘ మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి పీటలు ఎక్కేందుకు వధూవరులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రానున్న 70 రోజుల మంచి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు తెలిపారు.
Marriage Muhurat : మాఘ మాసం మొదలుకావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, కేటరింగ్ వాళ్లకు గిరాకీ పెరిగింది. రెండు నెలల శూన్యమాసం తర్వాత పెళ్లి ముహూర్తాలు మొదలవుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి పీటలు ఎక్కేందుకు వధూవరులు సిద్ధమవుతున్నారు. పుష్యమాసం పూర్తై మాఘమాసం వచ్చింది. మాఘమాసంలో వివాహాది శుభకార్యాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్. ఈ రెండు, మూడు నెలలు ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు, దేవాలయాల్లో పెళ్లి సందడి కనిపిస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 13(మంగళవారం) నుంచి ఏప్రిల్ 26 వరకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ 70 రోజుల్లో దాదాపు 30 మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. పెళ్లిళ్లు, అక్షరాభ్యాసాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలతో బంధు మిత్రులతో సందడి వాతావరణం కనిపిచనుంది. ఈ సీజన్ లో దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల వరకు వివాహాలు జరగనున్నట్టు అంచనా వేస్తున్నారు.
వసంత పంచమి-ప్రేమికుల రోజు
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలతో పాటు నవంబర్, డిసెంబర్ లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు తెలిపారు. దీంతో వివాహాలు, నూతన గృహప్రవేశాలు, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు జోరందుకుంటున్నాయి. రేపటి నుంచి మొదలుకానున్న పెళ్లి సందడి మరో మూడు నెలలు వరకు కొనసాగుతాయని పురోహితులు అంటున్నారు. అనంతరం గురు మౌఢ్యం, శుక్రమౌఢ్యం, శూన్య మాసం కావడంతో.. మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో శుభకార్యాలకు ముహూర్తాలు లేవన్నారు. మాఘ మాసం వసంత పంచమి రోజున ఏటా వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతుంటాయి. సరస్వతీ మాత పుట్టిన రోజు కావడంతో వసంత పంచమి నాడు శుభకార్యాలు, పెళ్లిళ్లకు ముహూర్తాలు నిర్ణయిస్తారు. ఈ ఏడాది వసంత పంచమి ఫిబ్రవరి 14 అంటే వాలంటైన్స్ డే నాడు వచ్చింది. దీంతో పెళ్లికి రెడీ అయిన జంటలు ఈ రోజునే ఒక్కటయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు.
ఫంక్షన్ హాల్స్ ఫుల్
పెళ్లి సీజన్ అంటే పూలు, పండ్లు, ఇతర వ్యాపారాలు జోరందుకుంటాయి. ముఖ్యంగా పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్, ఈవెంట్ నిర్వాహకులు, డీజేలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఈ మూడు నెలలు పండుగే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 60 వేల పెళ్లిళ్లు ఈ సీజన్ లో జరుగుతున్నట్టు సమాచారం. కిందటి ఏడాది నవంబర్, డిసెంబర్ లో తక్కువ ముహూర్తాలు ఉండడంతో కొందరు పెళ్లిళ్లను మాఘమాసానికి వాయిదా వేసుకున్నారు. ఇందుకు మూడు, నాలుగు నెలల ముందుగానే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, మియాపూర్, నార్సింగి, కోకాపేట్, ఎల్బీనగర్, చైతన్యపురి, కూకట్పల్లి, షాద్ నగర్, ఇతర ప్రాంతాల్లోని భారీ ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయని నిర్వహాకులు చెబుతున్నారు.
సంబంధిత కథనం