Hanamkonda Crime : 8 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం, చెయ్యి కొరికి తప్పించుకున్న చిన్నారి
Hanamkonda Crime : హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేశాడు. బాలిక ప్రతిఘటించి అతడి బారి నుంచి తప్పించుకుంది.
Hanamkonda Crime : హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల వయసుండే ఓ బాలికపై 30 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక దుండగుడి చేతిని కొరికి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాకతీయ యూనివర్సిటీ పోలీసులు.. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. రెండు రోజుల కిందట ఈ ఘటన జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ పీఎస్ పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన సుమన్ అనే 30 ఏళ్ల యువకుడు ప్లంబర్ పనిచేసేవాడు. కాగా సుమన్ఓ ఎనిమిదేళ్ల బాలిక ఈ నెల 18న అతడి వద్దకు వచ్చింది. తన తల్లికి ఫోన్ చేస్తానని, ఒకసారి ఫోన్ కలిపి ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో ఫోన్ చేసి ఇస్తానని బాలికను నమ్మించిన సుమన్.. ఆమెను ఇంట్లోకి పిలిచాడు. అనంతరం మాయమాటలు చెప్పి, సదరు బాలిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేయగా, బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. చివరకు అతని చేతిని కొరికి అక్కడి నుంచి పారిపోయి బయటకు పరుగులు తీసింది. అనంతరం తన తల్లి ఇంటికి వచ్చిన తరువాత జరిగిన విషయాన్ని మొత్తం తల్లికి చెప్పుకుని బోరున విలపించింది. దీంతో బాలిక తల్లి కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ మేరకు నిందితుడిపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. శనివారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కేయూ పోలీసులు వివరించారు.
పెరుగుతున్న అఘాయిత్యాలు
వరంగల్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఏటికేడు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన మూడేళ్ల రికార్డులు పరిశీలించినా.. ఇదే విషయం స్పష్టమవుతోంది. ఓ వైపు నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. కాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో 2021 నుంచి 2023 డిసెంబర్ నాటికి మొత్తంగా 415 రేప్(పోక్సో కేసులతో కలిపి) కేసులు నమోదు కావడం గమనార్హం. అందులో 2021లో 96 కేసులు, 2022లో 135 కేసులు నమోదు కాగా, 2023లో ఏకంగా వాటి సంఖ్య 184 కు చేరింది. 2021తో పోలిస్తే.. దాదాపు రెండింతలు పెరగగా, పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటున్నా పరిస్థితి మారకపోవడం కలవరానికి గురి చేస్తోంది. కాగా క్షేత్రస్థాయి మత్తు పదార్థాల వినియోగం వల్ల నేరాలు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోనే వాటి నివారణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జనాలు కోరుతున్నారు. అంతేగాకుండా ఇలా దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని, మహిళలు, బాలికలపై పెరుగుతున్న దాడులను అరికట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం